Minister Roja: దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్.

by Dishafeatures2 |
Minister Roja:  దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్.
X

దిశ, డైనమిక్ బ్యూరో : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి నూతనోత్తేజం వచ్చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖలపై విజయవాడ బెర్మ్ పార్క్ లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. జీఐఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంటే ఏంటో పారిశ్రామికవేత్తలకు తెలియడంతో టూరిజం, హాస్పటాలిటీ రంగాలలో రూ.21,941 కోట్లతో 123 ఎంఓయూలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఈ ఒప్పందాల ద్వారా 41,412 మంది రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ 123ఎంఓయూల్లో 40 డీపీఆర్‌లు ఇప్పటికే సబ్మిట్ చేసినట్లు మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. పెట్టుబడులకు ముందుకు వచ్చినవారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పర్యాటకులు రావడం జరిగిందని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

మంత్రిగా ఏడాది పూర్తి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి రోజా వెల్లడించారు. ఈ ఏడాదిలో చరిత్రలో ఎప్పుడూ, ఎన్నడూ లేనివిధంగా పర్యాటక, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించడం, శ్రీశైలం మల్లన్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోవడం, ఆ కార్యక్రమాల్లో తాను పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. క్రీడాకారులు, కళాకారుల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని, పర్యాటక రంగంలో ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటోందని మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు.రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది ఏపీటీడీసీ రికార్డు స్థాయిలో రూ.163.25 కోట్ల టర్నోవర్ సాధించిందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సదస్సుల్లో కళాకారులచే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మంత్రి రోజా స్పష్టం చేశారు. అలాగే జగనన్న ప్రభుత్వంలో అన్ని కాలేజీల్లో, స్కూళ్లలో ఈవిటీజింగ్ పూర్తిగా అరికట్టారని, రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

ఐదు ప్రాంతాల్లో 7స్టార్ హోటల్స్

ఒబెరాయ్ గ్రూప్ ద్వారా పీపీపీ విధానంలో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, హార్సిలీ హిల్స్, గండికోటలో రూ.1350 కోట్ల అంచనా వ్యయంతో 7 స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడుతున్నామని రోజా వెల్లడించారు. ఫలితంగా 10,900 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. స్పార్క్ సైబర్ టెక్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 100 టూరిస్టు ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 29న వరల్డ్ డాన్స్ డే సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఆ రోజున ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇప్పటికే టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్న మంత్రి ఆర్‌కే రోజా ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కేంద్రప్రసాద్ పథకం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధికి రూ.54.04 కోట్లు, అన్నవరం దేవాలయ అభివృద్ధికి రూ.54.17 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. డీపీఆర్, టెండర్లు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సైతం ఆంధ్రప్రదేశ్ కు వచ్చి శిక్షణ పొందేలా సౌకర్యాలు తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. ఈ సమీక్షా కార్యక్రమంలో పర్యాటక ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత భార్గవ, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబులతోపాటు ఎన్సీసీ అధికారులు క్రీడా యువజన సర్వీసుల, బెర్మ్ పార్క్ అధికారులు పాల్గొన్నారు.

Read more:

చంద్రబాబు ఓ సైతాన్.. మంత్రి రోజా


Next Story

Most Viewed