‘బనకచర్ల’ ప్రాజెక్టు నిర్మిస్తాం.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-18 08:32:22  IST  )

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

‘బనకచర్ల’ ప్రాజెక్టు నిర్మిస్తాం.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు(శుక్రవారం) మంత్రి నిమ్మల విశాఖపట్నంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును అన్ని అనుమతులు తీసుకుని నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని గతంలో వైసీపీ నేతలు మాట్లాడరని గుర్తుచేశారు.

గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని ప్రశ్నార్థకంగా చేసి.. ఈ రోజు వాళ్లే మళ్లీ పోలవరం పై మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. వారికి పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి నిమ్మల అన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని వాళ్లు ఇప్పుడేమో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలవరం దగ్గర ఏటా 3000 టీఎంసీల నీరు వృథాగా బంగాళాఖాతంలో కలుస్తోంది. వరదల సమయంలో గోదావరి నీటిని రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు తీసుకోవాలనేది మా ఆలోచన అని మంత్రి తెలిపారు.

ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో దీని పై రిపోర్టు కూడా ఇచ్చాం అన్నారు. రాబోయే రోజుల్లో అనుమతులు తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తాం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా.. వెలిగొండ ప్రాజెక్ట్ దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంది. దాన్ని 2026 కల్లా పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Next Story