- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్న ఫైర్.. భీమవరంలో ఆక్వా రైతుల ఆందోళన
ఆక్వా రైతులపై మోపిన రొయ్యల దాణా (ఫీడ్) ధరల పెంపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆక్వా రైతులపై మోపిన రొయ్యల దాణా (ఫీడ్) ధరల పెంపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా ధరలు పెంచిన ఫీడ్ కంపెనీలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనామీ ఫీడ్‌పై రూ.8, టైగర్ ఫీడ్‌పై రూ.10 చొప్పున ధరలు పెంచడాన్ని తప్పుబట్టిన మంత్రి అచ్చెన్నాయుడు.. తక్షణమే ఈ పెంపును నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ధరల పెంపు నిర్ణయం ఏపీఎస్ఏడీఏ (APSADA) చట్టం ప్రకారం కమిటీలో మాత్రమే జరగాలని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీల వ్యవహారశైలిని సహించేది లేదని హెచ్చరించారు.
ఆందోళన బాటలో ఆక్వా రైతులు..
మూడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు టన్నుకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు దాణా ధరలు పెంచడాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వీరవాసరం సెంటర్‌లో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫీడ్ కంపెనీలు, ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడుతూ నిరసనగా రొయ్యల మేత బస్తాలను దహనం చేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
పీకల లోతు కష్టాల్లో రైతాంగం
ఇప్పటికే అమెరికా సుంకాల పెంపు, రొయ్యలకు సోకుతున్న వ్యాధులు, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో కుదేలైన ఆక్వా రైతాంగానికి.. తాజా దాణా ధరల పెంపు కోలుకోలేని దెబ్బగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.






