Political Heat: ఏపీలో మేనిఫెస్టో మంటలు.. టీడీపీ వర్సెస్ వైసీపీ

by Disha Web Desk 16 |
Political Heat: ఏపీలో మేనిఫెస్టో మంటలు.. టీడీపీ వర్సెస్ వైసీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మినీ మేనిఫెస్టోపై రాజకీయ రగడ మొదలైంది. మినీ మేనిఫెస్టోలోని ఆరు హామీలు ప్రజల్ని మెప్పిస్తాయని టీడీపీ ధీమాతో ఉంది. ఈ పథకాలు మహిళలను ఆకట్టుకుంటాయని టీడీపీ భావిస్తోంది. మహిళను మహాశక్తిమంతురాలుగా చేయడమే టీడీపీ లక్ష్యం. తల్లికి వందనం.. తల్లి బిడ్డల అనుబంధానికి సంకేతం అని టీడీపీ చెప్తోంది. అయితే టీడీపీ మినీ మేనిఫెస్టోపై వైసీపీ సెటైర్లు వేస్తోంది.గతంలో హామీల సంగతేంటని నిలదీస్తోంది. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అందుకు టీడీపీ సైతం వదలడం లేదు. టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లిలో భూకంపం వచ్చినట్లు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైంది. టీడీపీ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని కౌంటర్ ఇస్తోంది. సమర్థుడు సంపాదించి ఇస్తాం అంటే పర్లేదు నమ్ముతాం. కానీ దివాళా తీసినోడు మళ్లీ అప్పు చేసి ఇస్తా అంటే ఎలా నమ్ముతారు అంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తోంది. ఇలా ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉండగా ఇప్పుడే

మేనిఫెస్టో ఇదే

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో కీలకమైన పథకాలను టీడీపీ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ... ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు, రైతులకు ఏటా రూ.20 వేలు, ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్, బీసీల కోసం ప్రత్యేక చట్టం వంటి కీలకమైన హామీలను మినీ మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది.

అయితే ఈ మినీమేనిఫెస్టోపై టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇది కేవలం సాంపిల్ మాత్రమేనని చెప్తోంది. పూర్తి మేనిఫెస్టో చూస్తే వైసీపీలో వణకుపుడుతుందని హెచ్చరిస్తోంది. ఇందుకు వైసీపీ ఏమాత్రం తగ్గడం లేదు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టిందని విమర్శిస్తోంది. చివరకు అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో కొత్త పథకంలా ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ విమర్శల దాడికి దిగుతోంది.

టీడీపీలో సంబరాలు

టీడీపీలో మినీ మేనిఫెస్టోపై సంబరాలు నెలకొన్నాయి. తెలుగు తమ్ముళ్లు కేశినేని చిన్ని ఆఫీసు వద్ద సంబరాలు నెలకొన్నాయి. మేనిఫెస్టోలోని హామీలపై నియోజకవర్గాల వారీగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీలో మినీ మేనిఫెస్టో సంబరాలను తీసుకువచ్చినట్లైంది. ఇకపోతే మినీ మేనిఫెస్టోకే మంటలు పుడితే పూర్తిది వస్తే వైసీపీలో మాట్లాడే వారిని వెతుక్కోవాల్సిందేనని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. మహిళను మహాశక్తిమంతురాలుగా చేయడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. తల్లికి వందనం.. తల్లి బిడ్డల అనుబంధానికి సంకేతమని కొనియాడారు. పేదరికాన్ని జయించేందుకు బిడ్డలు భారం కాదని, చదివే బిడ్డలందరికీ రూ.15 వేలు ఇస్తామని అని చెప్పుకొచ్చారు. మహానాడు విజయవంతంతో వైసీపీ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని మాజీ మంత్రి జవహర్ హెచ్చరించారు.

మరోవైపు టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లిలో భూకంపం వచ్చినట్లు అయ్యిందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని, జగన్ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో సంక్షేమం.. జగన్ హయాంలో మోసం జరిగిందని ధ్వజమెత్తారు. జగన్ నాలుగేళ్ల పాలనపై ప్రజలు మోసపోయారన్నారు. రూ.200 ఉన్న పెన్షన్‍ను రూ.2 వేలు చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడానికే జగన్ ఢిల్లీ టూర్ అని విమర్శలు చేశారు. కరెంట్ ఛార్జ్‌లు పెంచమంటూనే రూ.57 వేల కోట్ల భారం వేశారని, అలాగే బస్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి.. విపరీతంగా పెంచేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం: రామానాయుడు

మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పీపుల్స్ మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేష సానుకూల స్పందన లభిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వారు మరింత సాధికారత సాధించడానికి అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టారని చెప్పారు. ప్రతీ మహిళకు జిల్లా పరిధిలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తారని తెలిపారు. రానున్న చంద్రబాబు పాలనలో మహిళల భవితకు భరోసా అందిస్తారన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే నిరుద్యోగులకు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. బీసీల ద్రోహి జగన్ అని, నాలుగేళ్లలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, వారి కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. రాష్ట్రం అప్పులమయం అవుతోందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


టిష్యూ పేపర్‌తో సమానమంటున్న వైసీపీ

మినీ మేనిఫెస్టో ప్రకటనతో టీడీపీలో సంబరాలు నెలకొంటే అటు వైసీపీ మాత్రం విమర్శలకు పనిచెప్తోంది. ఈ హామీలైనా అమలుకు నోచుకుంటాయా అని ఎదురు ప్రశ్నిస్తోంది. గతంలో చంద్రబాబు 650 హామీలు ఇచ్చారని, వాటిలో కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని విమర్శలు చేస్తోంది. అందుకే చంద్రబాబు తన మేనిఫెస్టోను ఆన్ లైన్ నుంచి తొలగించారని చెప్తోంది. ఈ పరిణామాలతోనే చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని చెప్పుకొస్తున్నారు. డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో..! అంటూ మంత్రి జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ మేనిఫెస్టో...టిష్యూ పేపర్‌తో సమానం అని విమర్శించారు. ప్రెస్ మీట్‌లో టీడీపీ మేనిఫెస్టోను చించి చెత్తబుట్టలో పడేశారు.

‘పట్టుమని పది వాగ్ధానాలూ నెరవేర్చని డర్టీ ఫెలో బాబు. ఆల్‌ ఫ్రీ బాబు కాస్తా ఆల్‌ కాపీ బాబు అయ్యాడు. మేనిఫెస్టో జగన్‌కి ఒక పవిత్ర గ్రంథం. చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి వైఎస్‌ జగన్‌. 98.5 శాతం మేనిఫెస్టోను 4 ఏళ్ళలోనే నెరవేర్చిన నాయకుడు జగన్. మా హయాంలో ప్రతి ఊర్లో అభివృద్ధి.. ప్రతి గడపలో సంక్షేమం. చంద్రబాబూ..నీకు దమ్ము, ధైర్యం ఉంటే మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా..?’ అని మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు.

మొత్తానికి ఈ మినీ మేనిఫెస్టో ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. తమ మేనిఫోస్టో గొప్పదని టీడీపీ అంటుంటే గతం సంగతేంటని వైసీపీ నిలదీస్తుంది. ఇలా విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

ఇవి కూడా చదవండి:

Minister Nagarjuna: టీడీపీ మేనిఫెస్టోపై సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed