ఏపీ హైకోర్టు నూతన సీజేగా లీసా గిల్.. నేడు ప్రమాణ స్వీకారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 03:39:46  IST  )

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఏపీ హైకోర్టు నూతన సీజేగా లీసా గిల్.. నేడు ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice) జస్టిస్ లీసా గిల్ (Lisa Gill) ఇవాళ రాత్రి ౭ గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని జరగనున్న ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Syed Abdul Nazeer) ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

అయితే, జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తూ నిష్పాక్షిక తీర్పులకు పేరుగాంచారు. అయితే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే వారి వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. న్యాయపాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఓ మహిళా న్యాయమూర్తి సారథ్యం వహించనుండటం పట్ల న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక కేసులు, న్యాయ పరిపాలన అంశాలపై ఆమె రాకతో వేగం పుంజుకోనుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Next Story