శ్రీశైలంలో శివస్వాముల కోలాహలం

by Thanuru Gopichand |

శివస్వాముల తాకిడితో శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రం కిటకిటలాడుతోంది. తెలుగురాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా శివమాల ధరించిన భక్తులు దీక్ష విరమణ కోసం శ్రీశైలానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.

శ్రీశైలంలో శివస్వాముల కోలాహలం
X

దిశ, వెబ్ డెస్క్ : శివస్వాముల తాకిడితో శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రం కిటకిటలాడుతోంది. తెలుగురాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా శివమాల ధరించిన భక్తులు దీక్ష విరమణ కోసం శ్రీశైలానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. కార్తీక మాసమంతటా కఠిన దీక్షతో, నియమాలను పాటించిన శివస్వాములు (Shiva Swamulu) స్వామివారికి ముడుపును చెల్లించుకునేందుకు క్యూకట్టారు. ఈ క్రమంలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది శివస్వాములు భారీగా తరలిరాగా.. దేవాలయ పరిసరాలంతా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి.

​కార్తీక మాసంలో మండల దీక్షలు (41 రోజులు) లేదా అర్ధ మండల దీక్షలు (21 రోజులు) స్వీకరించిన శివదీక్షా భక్తులు తమ దీక్షా విరమణ కోసం శ్రీశైలానికి చేరుకున్నారు. ఈ దీక్షా విరమణ కార్యక్రమంలో జ్యోతిర్ముడి సమర్పణ ప్రధానమైన ఘట్టంగా దీక్షాపరులు పేర్కొంటున్నారు. శివదీక్షను పూర్తిచేసుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో తెచ్చుకున్న ఈ జ్యోతిర్ముడిని హోమగుండంలో సమర్పించి దీక్షను విరమిస్తారు.

​జ్యోతిర్ముడిని ధరించిన శివస్వాములకు స్వామివారి స్పర్శదర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ మార్గంలోని శిబిరాల వద్ద దీక్షా విరమణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. దీక్షా విరమణ పూర్తయ్యేవరకు ఈ శిబిరాల్లోని దేవతామూర్తులకు నిత్యం పూజాధికాలు నిర్వహిస్తారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. ​ఈ పవిత్రమైన సమయంలో శ్రీశైలంలో శివస్వాముల భక్తి, దీక్షా నియమాలు, భగవంతుడి పట్ల వారి అంకితభావం అద్భుతమైన ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగిస్తోందని సాధారణ భక్తులు చెబుతున్నారు.

Next Story