ఉగ్ర కుట్ర భగ్నం కేసులో కీలక పరిణామం.. నిందితులకు రిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-19 08:22:26  IST  )

విజయనగరంలో టెర్రర్‌ లింక్స్‌ కేసు విచారణలో పోలీసులు జోరు పెంచారు.

ఉగ్ర కుట్ర భగ్నం కేసులో కీలక పరిణామం.. నిందితులకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం (Vizianagaram) ఉగ్ర కుట్ర భగ్నం కేసులో పోలీసులు జోరు పెంచారు. ఈ మేరకు కీలక నిందితులు సిరాజ్, సమీర్‌ సయ్యద్‌లను తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు ఇవాళ విజయనగరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఆ ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. అదేవిధంగా నిందితులకు నిధులు ఎవరు, ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో వారిని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే వారి వాదనలతో పూర్తిగా ఏకీభవించిన కోర్టు నిందితులు సిరాజ్‌, సయ్యద్‌ సమీర్‌లకు 14 రోజల రిమాండ్ విధిస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆ ఇద్దరిని విచారణ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

నిందితులు ఆ సంస్థకు చెందిన వారే..

తెలుగు రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకుని వరుస బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తున్న టెర్రరిస్టుల కుట్రలను దర్యాప్తు సంస్థలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయనగరంలో కేసు నమోదు కాగా.. అదే ప్రాంతానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (29)తో పాటు సికింద్రాబాద్‌ (Secunderabad) బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ (28)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిరాజ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జాబ్స్ కోసం చూస్తుండగా.. సమీర్‌ లిఫ్ట్‌ ఆపరేటింగ్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా లభించిన ఆధారాల మేరకు ఆ ఇద్దరూ అల్‌ హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (Al-Hind Ittehadul Muslimeen) సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. పేలుళ్ల కుట్రలో సిరాజ్‌ ఉర్ రెహ్మాన్ ప్రధాన సభ్యుడిగా ఉండగా.. సమీర్‌ సయ్యద్ సహాయకుడి ఉన్నట్లుగా తెలిసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాస్టింగ్ పాఠాలు..

ఇక సౌదీ అరేబియా (Saudi Arabia) నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థకు చెందిన హ్యాండ్లర్‌ టెర్రర్ ఎటాక్, బాంబ్ బ్లాస్ట్ ఎలా చేయాలో వారికి గైడ్ చేసినట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. మొత్తం సంప్రదింపులు ఎవరికి అనుమానం రాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటర్ నుంచి జరిపినట్లుగా తెలుస్తోంది. భారీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తూ.. పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ ఇతర మందుగుండు సామగ్రిని కొనుగోలు చేశారని నిర్ధారణ అయింది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం ఏరియాలో బ్లాస్ట్ రిహార్సల్స్‌ చేపట్టాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు వారి కుట్రను చాకచక్యంగా భగ్నం చేశారు.

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి రిమాండ్ సిరాజ్‌ ఉర్ రెహ్మాన్, సమీర్ సయ్యద్ రిమాండ్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు టెలిగ్రామ్‌లో ఆరుగురు కలిసి గ్రూప్ క్రియేట్ చేసినట్లుగా తేలింది. నిందితులు సిరాజ్, సమీర్‌తో పాటు కర్నాటక, మహారష్ట్రకు చెందిన యువకులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఐసీస్ ఆదేశాలను అమలు చేయడంపై మూడు రోజుల పాటు కలిసి మీటింగ్ నిర్వహించినట్లుగా వెల్లడైంది. టిఫిన్ బాక్స్ బాంబులు తాయారు చేయాలని పైనుంచి ఆదేశాలు అందగా.. అమెజాన్‌లో టిఫన్ బాక్స్‌లు, వైర్లు, రిమోట్ సెల్స్‌ను సిరాజ్ ఆర్డర్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Next Story