కేరళ డోలు వాయిస్తూ హోం మంత్రి సందడి

by Thanuru Gopichand |

పాయకరావుపేటలో సంక్రాంతి సంబరాలు.

కేరళ డోలు వాయిస్తూ హోం మంత్రి సందడి
X

దిశ, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా (Anakapalli District) నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని తమ నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పాల్గొన్నారు. భోగి మంటలను వేసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కళాకారులతో కలిసి ఆనందంగా గడిపారు. గంగిరెద్దులకు పూజలు చేశారు. హరిదాసు కీర్తనలను ఆస్వాదించారు. అయితే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ సంప్రదాయ వాయిద్యాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెండా అని పిలుచుకునే ఆ డోలు చప్పుళ్లకు ఆకర్షితులైన హోం మంత్రి.. వాటిని ఎంతో ఉత్సాహంగా వాయిస్తూ సందడి చేశారు. తాళానికి తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ పండుగ వేడుకలకు శోభను తెచ్చారు. మంత్రి స్వయంగా డోలు వాయించడం చూసి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఏపీ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి కుటుంబంలో ఆనందం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి పండుగ అంటేనే వ్యవసాయాధారిత పండుగ అన్నారు. ఇది పాడి పంటల పండుగని వివరించారు. సంక్రాంతి పండుగకు అన్నదాతకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రైతు ఇంట పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు, టీడీపీ కార్యకర్తలతో కలిసి హరిదాసు కీర్తనలు, బసవన్నల ఆటల నడుమ భోగి పండుగను జరుపుకోవడం మరచిపోలేని అనుభూతిగా తెలిపారు.

Next Story