ఏటా జనవరి వస్తోంది.. పోతుంది : వైయస్ షర్మిల

by Thanuru Gopichand |

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఏటా జనవరి వస్తోంది.. పోతుంది : వైయస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : జాబ్ క్యాలెండర్ విషయమై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ విషయమై తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక పోస్టును చేశారు. రెండేళ్ల పాలనలో హామీలు ఘనంగా ఉన్నాయిగానీ, అమలులో మాత్రం మోసం జరుగుతోందని ఆరోపించారు. ప్రతి ఏటా జనవరి వస్తోంది.. పోతోందని.. క్యాలెండర్ మారుతున్న జనవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం ఏ దిక్కున ఉందో తెలియడం లేదన్నారు. ఉద్యోగాల పేరుతో ఆశచూపి నిరుద్యోగుల ఓట్లను కూటమి పార్టీలు దండుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచి రెండో ఏడాది వచ్చినా జాబ్ క్యాలెండర్ ఊసెత్తకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడడం సరికాదన్నారు.

వైసీపీ చెవిలో పువ్వులు పెట్టింది

గత వైసీపీ పాలనపై విమర్శలను గుప్పిస్తూ.. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట యువత చెవుల్లో పూలు పెడితే, కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందని ఎద్దేవా చేశారు. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటి ? ఇదిగో అదిగో అని ఊరించడం తప్పా ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది ? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అంటే ఆవేదనకు లోనయ్యారు.

నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారు

జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఉన్నది అమ్ముకుని సైతం కోచింగులు తీసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తారా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో కలిపి ఖాళీలు 2 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా ఉందన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక కొలువులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు.

Next Story