ఆంజనేయస్వామి అందరి దేవుడు: కొండగట్టులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆంజనేయస్వామి అందరి దేవుడు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు...

ఆంజనేయస్వామి అందరి దేవుడు: కొండగట్టులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంజనేయస్వామి అందరి దేవుడు అని, విశ్వాంతర్యామి అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న(Kondagattu Anjanna)ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్నారు. తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం అందిస్తామన్నారు. అందరూ పూనుకుంటే ఆంజనేయస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదన్నారు. త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్సించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆంజనేయస్వామి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.

వసతి సముదాయం, దీక్షా మండపానికి శంకుస్థాపన

కాగా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) నిధులు రూ.35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శనివారం శంకుస్థాపనలు చేశారు. 2024 ఎన్నికల ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. అప్పుడు ఆలయంలో వసతి సముదాయం, దీక్షా మండపం అవసరాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి ఆలయ అధికారులు, పండితులు తీసుకెళ్లారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి వస్తున్న భక్తులు, ఆంజనేయస్వామి మాల ధరించి వస్తున్న స్వాములు పడుతున్న ఇబ్బందులను పవన్‌కి తెలిపారు. దీంతో ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్లారు. ఈ మేరకు టీటీడీ ధార్మిక మండపాల నిర్మాణాల నిమిత్తం వెచ్చిస్తున్న నిధుల నుంచి రూ.35.19 కోట్లను కొండగట్టు ఆలయంలో సత్రం, దీక్షల విరమణ మండపాలను నిర్మించేలా కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 96 గదుల వసతి సముదాయం, 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా అతి పెద్ద మండపం అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులకు పవన్ కల్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు.

Next Story