Ap News: ఎన్నికల మూడ్‌లోకి పవన్... జనసేన నేతల్లో హర్షం

by Disha Web Desk 16 |
Ap News: ఎన్నికల మూడ్‌లోకి పవన్... జనసేన నేతల్లో హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. వారాహి విజయయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చేశారు. విడతల వారీగా పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. వారాహి విజయ యాత్రను ఉభయగోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వారాహి విజయయాత్రలో భాగంగా బహిరంగ సభలలో ప్రసంగించడమే కాకుండా ఇతర అంశాలపై ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్. ‘ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి జీవన విధానం మెరుగుపరచడానికి ఎలాంటి పాలసీలు తీసుకురావాలో అధ్యయనం చేయడం కోసం ప్రముఖులతో భేటీ అవుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మాటలు వినాలని భావిస్తున్నాం. వారికి ఎలాంటి పాలన విధానాలు కావాలో తెలుసుకుంటున్నాం. ప్రతీ నియోజకవర్గం నుంచి ప్రముఖులు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. వాటిని అవగతం చేసుకుని, ఆయా ప్రాంతాలలో ముందడుగు వేయడానికి చేయాల్సిన ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తాం’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతేకాదు వారాహి విజయ యాత్ర తొలివిడత అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఉంటుందని ఆ గ్యాప్‌లో నియోజకవర్గాల ఇన్‌చార్జిలను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.

జనసేనాని దూకుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక రాజకీయంగా దూకుడు పెంచారు. వారాహి విజయ యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలిరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించి కత్తిపూడిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ కేవలం వారాహిపై ఉండి ప్రసంగించడమే కాకుండా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏయే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖులతో పవన్ కల్యాణ్ భేటీ కావాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని సమస్యలు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిని స్వయంగా తెలుసుకని లోతైన అధ్యయనం కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన రంగాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై లోతైన అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గంలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, లాయర్లు, స్వచ్చంద సేవకులు ఇతర రంగాలలోని నిపుణులతో పవన్ కల్యాణ్ మమేకం అవ్వాలని నిర్ణయించారు. తొలుత జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గంలోని సమస్యలను పవన్ కల్యాణ్ స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రముఖులతో చర్చించి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే సమస్య మూలాలు అర్థమవుతాయి. దానిని నిపుణులు, సామాజికవేత్తలతో చర్చిస్తే పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ఆయా నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితిని స్వయంగా తెలుసుకుని, లోతైన అధ్యాయనం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

గోదావరి జిల్లాల నుంచే

వారాహి విజయయాత్రను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అలాగే ప్రతీ సమస్యపై లోతైన అధ్యాయనం కార్యక్రమాన్ని కూడా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించారు. గొల్లప్రోలులో గురువారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, లాయర్లు, స్వచ్చంద సేవకులు, ఇతర రంగాల ప్రముఖులతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయా రంగాల వారీగా నెలకొన్న పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకుని పుస్తకంలో నోట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు, పిఠాపురం నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను అవగతం చేసుకునేందుకు ఆయన ప్రాధాన్యమిచ్చారు. జనసేన ప్రభుత్వం వస్తే నియోజకవర్గానికి ఏం చేయాలి అన్న దాని మీద ప్రముఖులను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత అంశాలు నియోజకవర్గంలో ఏమున్నాయన్న విషయంతో పాటు రాష్ట్రస్థాయిలో రంగాల వారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రశ్నించి, వారు చెప్పిన పూర్తిస్థాయి వేదనను అర్థం చేసుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కేవలం సాధారణ సమావేశంలా కాకుండా ఆయా రంగాల్లోని ప్రముఖులతో ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక సమయం కేటాయించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో...అసలు క్షేత్ర స్థాయిలో మారుతున్న జీవన విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కనీసం తాగు నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీటి వెతలు ఎక్కువగా ఉన్నాయని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో గ్రామాల పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిందని, పేదలు మరింత పేదలుగా మారుతూ పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇన్‌చార్జిల ప్రకటనపై కసరత్తు

పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్రను విడతల వారీగా చేపట్టాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్‌లో నియోజకవర్గాలపై పార్టీ పెద్దలు ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఆ గ్యాప్‌లో నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటిస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గంలో అయితే పర్యటించారో ఆ నియోజకవర్గంలో నాయకులపై ఆరా పవన్ ఆరా తీస్తారు. ప్రజా సేవ సేవ చేయాలపట్ల ఆసక్తి కలిగిన నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం.. ఉన్నవారిలో ది బెస్ట్ నాయకులను ఇన్ చార్జిలుగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

YS Jagan Mohan Reddy : సలహాదారులకు సీఎం జగన్ తీపికబురు

Next Story

Most Viewed