దమ్ముంటే మమ్మల్నీ అరెస్ట్ చేసుకోండి- కేజ్రీవాల్

by Shamantha N |
దమ్ముంటే మమ్మల్నీ అరెస్ట్ చేసుకోండి- కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో తన మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ అరెస్టుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తమను కూడా అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఈ అరెస్టులను నిరసిస్తూ ‘జైల్ భరో’ కార్యక్రమానికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముడతానని ఆయన ప్రకటించారు. కేంద్ర సర్కారుకు దమ్ముంటే ఆప్ నేతలు, కార్యకర్తలందరినీ ఒకేసారి అరెస్టు చేయాలన్నారు. బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ కామెంట్స్ చేశారు. తనను, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఇలా ఒక్కొక్కరినీ జైలులో పెట్టి ప్రధాని మోడీ గేమ్స్ ఆడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేతలందరినీ ఎందుకు జైల్లో పెట్టాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. ‘‘గతంలో మా ఎంపీ సంజయ్ సింగ్‌ను జైల్లో పెట్టారు. ఈ రోజు నా సహాయకుడు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు రాఘవ్ చడ్డా లండన్ నుంచి తిరిగి వచ్చాడు. ఆయన్ని కూడా అరెస్టు చేయండి. సౌరభ్ భరద్వాజ్‌ను, అతిషిని జైల్లో పెడుతామని చెబుతూనే ఉన్నారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడం, మొహల్లా క్లినిక్‌లను నిర్వహించడం మేం చేసిన తప్పా ? మా పార్టీ నేతల్ని అరెస్టు చేసి ఆప్‌ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అలోచనా విధానం.. దాన్ని ఎవరూ అణచివేయలేరు. అణచివేసిన కొద్దీ అది మరింత తీవ్రరూపు దాలుస్తుంటుంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed