చికిత్స కోసం వెళితే గర్భశయాన్నే తీసేయాల్సి వచ్చింది...

by Sridhar Babu |
చికిత్స కోసం వెళితే గర్భశయాన్నే తీసేయాల్సి వచ్చింది...
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు పై ఉన్న షాహీన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ గర్భాశయం కోల్పోయింది. ఈమేరకు శనివారం డీఎంహెచ్ఓ కు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు మాట్లాడుతూ వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల యువతి గర్భాశయం తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ నందు గల షాహీన హాస్పిటల్ డాక్టర్ సనుబర్ రెహమాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రహేలా ఫిర్డోస్ అనే మహిళ డెలివరీ కోసం ఏప్రిల్ 17న నిజామాబాద్‌లోని ఖిల్లా రోడ్‌లో ఉన్న షాహీన్ హాస్పిటల్‌లో చేరింది.

20న డిశ్చార్జ్ చేశారు. అయితే 2024 ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, రక్తస్రావం అవడంతో షాహీన్ ఆసుపత్రికి తరలించగా ఏప్రిల్ 26న డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఒక నర్సు మందులు ఇచ్చింది. ఉదయం 6.30 గంటలకు డాక్టర్ సనుబర్ రెహమాన్ వచ్చి పరీక్ష ఫలితాలు చూసి కొన్ని పరీక్షలు, మందులు సూచించారు. డాక్టర్ రక్తస్రావాన్ని నియంత్రించడానికి తమ వద్ద సరైన పరికరాలు లేవని నిజామాబాద్‌లోని మనోరమ ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపారు. మనోరమ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు పరిశీలించి గర్భాశయ ఆపరేషన్ సరిగా చేయకపోవడంతో రక్తస్రావం అవుతున్నట్టు తెలిపారు. వెంటనే గర్భాశయాన్ని శాశ్వతంగా తొలగించారు. తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన షాహీన్ హాస్పిటల్‌ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్​ చేస్తున్నారు.

Next Story

Most Viewed