‘మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘చంద్రబాబు గారూ.. ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్‌-6, సూపర్‌-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. వైసీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం’ అని జగన్ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story