- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ.. భక్తులకు తప్పని తిప్పలు
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో కాలినడకన తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధికి చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇక వేసవి కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే.
ఈ తరుణంలో తిరుమలలో జూన్ 6వ తేదీ నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సమయ నిర్దేశిత సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి దర్చించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా జారీ చేస్తోంది.
అయితే.. శ్రీవారి భక్తులు(Devotees) సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు క్యూలైన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ వద్ద శాశ్వత షెడ్ల క్యూలైన్‌లోకి వెళ్లడానికి భక్తులు నిన్న(శనివారం) ఉదయం 11 గంటల నుంచి ఎండలో నిరీక్షించారు. మధ్యాహ్నం 12.30కి టీటీడీ సిబ్బంది గేట్లు తీశారు. దీంతో భక్తులంతా ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కొండపై క్యూలైన్లలో టోకెన్ల కోసం గంటల తరబడి వేచి నిల్చోవాల్సి వస్తుందనీ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






