- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎడ్డెం అంటే తెడ్డెం.. ఆ పదవికోసం నలుగురి పాకులాట
విశాఖ కేజీహెచ్ లో అడ్మినిస్ట్రేషన్ అధికారి - సూపరింటెండెంట్ల మధ్య పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది.

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్నట్టు తయారైంది కేజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి, సూపరింటెండెంట్‌ల పరిస్థితి. వారు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, ఇటు కిందిస్థాయి సిబ్బందితో పనులు చేయించుకుంటూ రోగులకు ఉత్తమ వైద్యం అందించేందుకు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు. అయితే వారు ఏ ప్రణాళిక రచించినా, ఏ ఆదేశాలు ఇచ్చినా తు.చ. తప్పకుండా కింది స్థాయి సిబ్బంది అమలు చేయాల్సి ఉంది. వాటిని అమలు చేయించాల్సిన బాధ్యత వివిధ విభాగాల అధిపతులపై ఉంది. ఒకటి రెండు విభాగాల అధిపతులు మాత్రం ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంటారని వినికిడి. ఏ ఆదేశాలిచ్చినా తమ విభాగాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి కొర్రీలు వేసే పనిలో ఉంటారు. పైగా దానిని తమకున్న పలుకుబడిని ఉపయోగించి మీడియాను, రాజకీయ నాయకులను ఉసిగొల్పే పనిలో ఉంటారని సమాచారం. ఎప్పుడు ఏ లొసుగు దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ చిన్న అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకొని తమ అనుచర గణంతో విపరీతమైన నెగిటివ్ ప్రచారానికి తెరలేపుతున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి.
103 ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు
విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు కూడా వైద్యరంగంలో కీలక ఆసరాగా నిలుస్తోంది. సుమారు 103 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన సేవా సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం రోజుకు సుమారు 3500 మంది అవుట్ పేషెంట్లు వైద్యం పొందుతుండగా, 400 మందికి పైగా రోగులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నారు. రోజూ వందల సంఖ్యలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. దీని నిర్వహణకు సుమారు 40 విభాగాలున్నాయి. వీళ్లంతా సక్రమంగా పని చేసినప్పుడే కెజిహెచ్ అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగుతుంది. ప్రతి డిపార్ట్ మెంట్‌కూ ఒక హెడ్ ఉంటారు. వారు సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేషన్ అధికారి అండర్ లో పని చేయాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్ మెంట్లలోనూ వారి ఆదేశాలు అమలవుతున్నా ఒకటి రెండు డిపార్ట్మెంట్ లలో మాత్రం ఎడ్డెం అంటే తెడ్డెం అనేలా అడ్డంగా తలలూపుతుంటారు. పనిలో జాప్యం విషయమై వారి పై అధికారులు అడగ్గా ‘మాకూ రూల్సు తెలుసూ.. అందులో లొసుగులూ తెలుసు’ అన్నట్టు వ్యవహరిస్తుంటారని, అవసరమైతే స్థానిక రాజకీయ నాయకుల్ని కూడా ఇన్వాల్వ్ చేయించి పరిపాలనా విభాగం అధికారులపై ఒత్తిడి పెంచడానికి కూడా వెనకాడడం లేదట. సదరు డిపార్ట్ మెంట్‌తో ఏపనైనా చేయించాలంటే సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్ హోదా స్థాయిలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అధికారి కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటీవల అడ్మినిస్ర్టేషన్లో ఉన్నతాధికారిపై ఒక మహిళతో ఏవో ఆరోపణలు చేయించి ఆయనను కూడా భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆ నలుగురు ఎవరు?
శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో రిక్రూట్‌మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యి అనంతరం ఇక్కడికి బదిలీ అయిన అధికారి ఒకరైతే, రేడియాలజీ విభాగంలో ఒక సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న ఇద్దరు, ఎష్టాబ్లిష్మెంట్ విభాగంలో ఒక సీనియర్ సహాయకులు. ఈ నలుగురు కలిసి గ్రూపు రాజకీయాలు నడుపడంలో సిద్ధహస్తులనే పేరుంది. ఇటీవల మినిస్టీరియల్ స్టాఫ్ ను రీ ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలోనూ కొంత మందిని గిల్లి ధిక్కార స్వరం వినిపించడానికి ప్రేరేపించిన వారిలో ఈ నలుగురే ప్రథములనే వినికిడి కూడా ఉంది.
ఇటీవల పరిణామాలు కూడా ఆతరహా లోనివేనా?
ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు కేజీహెచ్‌ను వార్తల్లో నిలిపాయి. ఇటీవల సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో ఒక శిశువు మృతదేహం కనిపించడం పెద్ద కలకలం రేపింది. దుర్వాసన రావడంతో సిబ్బంది పరిశీలించగా అక్కడ కుళ్లిపోయిన శిశువు మృతదేహం కనిపించింది. ప్రసూతి వార్డు సూపరింటెండెంట్ కార్యాలయానికి చాలా దూరంలో ఉండటంతో ఈ ఘటనపై అనుమానాలు తలెత్తాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఆసుపత్రికి సంబంధం లేని ఓ మహిళ ఆ మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు గుర్తించారు. అయితే ఆమెను అక్కడికి పంపింది ఎవరు అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇటీవల కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ జరిగి కలకలం రేపింది. ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి పరిపాలనా విభాగం 40 మంది రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ ఘటన విషయంలో కూడా మేనేజిమెంట్‌కు నెగిటివ్ గానే సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఇక చిన్నపిల్లల విభాగంలో కాలు విరిగిన గాయాలతో వచ్చిన ఓ చిన్నారి మృతి చెందడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రాణం పోవడం అన్నది పెద్దదే. అయితే రాజకీయ నాయకుల జోక్యం కూడా ఒక రకమైన అనుమానాలకు తావిచ్చింది. వీటన్నింటిలోనూ వారి పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుందని సిబ్బందిలో చర్చ నడుస్తోంది. పాలన వైఫల్యంగా చూపించి ప్రస్తుతం పరిపాలనలో ఉన్న అధికారులను తప్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని ఆనోటా, ఈ నోటా వినబడుతున్న మాట. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ వ్యక్తి కూడా ఆ నలుగురికీ వెన్నుదన్నుగా ఉండి కథ నడిపించి ఉండవచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు. వారి పాచిక పారితే ఆ సూపరింటెండెంట్ స్థానం మళ్లీ తనకే వస్తుందనే ఆశతో కూడా ఇలా చేయించి ఉండవచ్చనేది ఒక అంచనా.
అసలు నిజం బయటపడాల్సిందే
అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న సమయంలో వరుస వివాదాలు బయటకు రావడం వెనుక అసలు కారణం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేజీహెచ్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రి పేరు ప్రతిష్టలను కాపాడటమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అవసరం. వివాదాల వెనక ఉన్న నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






