సేనాని ఏం సెప్తారు.. టీడీపీతో పొత్తు కుదరకుంటే బీజేపీని వదిలేస్తారా !

by Dishanational2 |
సేనాని ఏం సెప్తారు.. టీడీపీతో పొత్తు కుదరకుంటే బీజేపీని వదిలేస్తారా !
X

బీజేపీ పెద్దలతో ఇటీవలి చర్చల్లో ఏం జరిగిందో ఏమో. చంద్రబాబు మౌనం వహించారు. దీనికితోడు తెలుగు తమ్ముళ్లు బీజేపీతో పొత్తుపై కన్నెర్రజేస్తున్నారు. పార్టీ ఉనికికే ప్రమాదమని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్నారు. అయినా బాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి రాకుంటే మరి పవన్​ కల్యాణ్​ పరిస్థితేంటీ ! ఆయన బీజేపీతోనే కొనసాగుతారా ? కాషాయ పార్టీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. దీనికితోడు 14 నుంచి చేపట్టనున్న వారాహి యాత్రలో పవన్ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గోదావరి జిల్లాల్లో పర్యటన సందర్భంగా పోలవరంపై కొర్రీలు వేస్తోన్న కేంద్రాన్ని విమర్శిస్తారా ! విశాఖ ఉక్కు అమ్మకంపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తారా అనేది పార్టీ శ్రేణులతోపాటు ఆయా జిల్లాల్లోని పవన్​ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ప్రధానంగా ఆరు హామీలను ఇచ్చారు. వారాహి యాత్రలో పవన్​ కల్యాణ్​ వీటి గురించి ప్రస్తావిస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈపాటికే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్​ సంకేతాలిచ్చారు. బీజేపీ –టీడీపీ మధ్య సఖ్యత కుదరకపోతే బీజేపీని వదిలేసి టీడీపీతో కలుస్తారా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. టీడీపీతో కలిసి సాగేందుకు బీజేపీని ఒప్పిస్తాననే ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. మొన్న చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య జరిగిన సమావేశంలో ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. వాళ్లేం అడిగారో.. అందుకు చంద్రబాబు ఏం చెప్పారో ఎవరికీ తెలీదు. చంద్రబాబు ద్వారా పవన్​కు తెలిసే అవకాశముంది. దీన్నిబట్టి వారాహి యాత్రలో పవన్​ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలవరంపై స్పందనమేటి?

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పోలవరంపై స్పష్టమైన ప్రకటన చేశారు. 2024 జూన్​ నాటికి పూర్తి చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. అంటే ఆమేరకు అవసరమైన నిధులు ఇచ్చి పూర్తి చేయలేరని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉన్నందున సవరించిన అంచనాలను ఆమోదించాలని అడుగుతోంది.

రెండేళ్లుగా అదే తంతు..

జలవనరుల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదనలను పంపుతారు. వాళ్లు కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తారు. అక్కడ నుంచి ఆర్థిక శాఖకు చేరాక పాత అంచనాలకే పరిమితమంటూ ప్రతిపాదనలను వెనక్కి కొట్టడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. పునరావాసం, పరిహారానికి సంబంధించి సుమారు రూ.30 వేల కోట్లు అవసరముంది. ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణం 75 శాతం పూర్తయినా, పునరావాస పనులు 10 శాతానికి మించి జరగలేదు. దీనిపై జనసేనాని కేంద్రం తీరుపై ఎలా స్పందిస్తారనేది గోదావరి వాసుల్లో చర్చ జరుగుతోంది.

విశాఖ ఉక్కుపై ఏమంటారు?

ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఉక్కును తెగనమ్మేందుకే కేంద్రం కట్టుబడి ఉంది. విక్రయించాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. దీనిపై పవన్​ ఎలా రియాక్ట్​ అవుతారనేది ప్రశ్నార్థకం. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే అరకొర ప్యాకేజీని కేంద్రం ఈపాటికే నిలిపేసింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నష్టపోయాయి. రైల్వే జోన్​ గురించి కేంద్రం అసలు ప్రస్తావించడం లేదు. విశాఖ – కాకినాడ పెట్రో కారిడార్​ ఏమైందో తెలీదు. పవన్​ తెలివిగా వీటన్నింటి గురించి మాట్లాడతారా.. అభిమానులను అలరించే సినీ డైలాగులతో రెచ్చిపోతారా అనేది చర్చనీయాంశమైంది. కేవలం రాష్ట్ర సర్కారును టార్గెట్​ చేస్తూ పార్టీ శ్రేణులను సంతృప్తి పరచడానికే పరిమితమవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేంద్రం రూ.17 వేల కోట్లు ఇస్తుందా..

పోలవరం ప్రాజెక్టుకు అడ్​ హాక్​గా రూ.17 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు ఇటీవల చెప్పారు. త్వరలో జరిగే కేబినెట్లో దీనికి ఆమోదం లభిస్తుందని వెల్లడించారు. మంగళవారం సీఎం జగన్​ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత పవన్​ వారాహి యాత్రలో పోలవరంపై ఎలా స్పందిస్తారనేది గోదావరి వాసుల్లో చర్చనీయాంశమైంది.

Read more:వన్ మ్యాన్ షో.. జనసేన పార్టీలో ఆయనే నంబర్-2


Next Story

Most Viewed