Janasena: వన్ మ్యాన్ షో.. జనసేన పార్టీలో ఆయనే నంబర్-2

by Disha Web Desk |
Janasena: వన్ మ్యాన్ షో.. జనసేన పార్టీలో ఆయనే నంబర్-2
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆ పార్టీకి అతడే ఒక సైన్యం. అధినేత చెప్తే శిరసా వహిస్తాడు. పార్టీ పెట్టిన అధినేత గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుంటే నెంబర్ 2 అయినటువంటి ఆ నాయకుడు మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఏకంగా రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. అలుపెరగని శ్రామికుడిలా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటు పార్టీ అధినేత సైతం సొంత వాళ్లను కాదని ఆయనకు పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చేశారు. నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని సొంత పార్టీల నేతలు విమర్శలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అంతేకాదు వెన్నుపోటు పొడుస్తారంటూ పార్టీ అధినేతకు సైతం ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన నేరుగా పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని విమర్శిస్తే సహించేది లేదని ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇంతకీ.. ఆ పార్టీ ఏంటి.. గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్న ఆ అధినేత ఎవరు.. సొంత వాళ్ల కంటే నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్న ఆ నెంబటర్ 2 ఎవరు? ఆ కథాకమామీసు ఏంటి అనేది దాదాపు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది కదా.

ఆ పార్టీ జనసేన. నెంబర్ 2 పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో నెంబర్ 2 గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ క్రియాశీలక రాజకీయాల్లో చాలా హుందాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక సందర్భంలో అధినేత కంటే పార్టీపట్ల చొరవ చూపిస్తూ జనసైనికులకు మరింత దగ్గర అయ్యారు నాదెండ్ల మనోహర్. సొంత వాళ్ల కంటే నాదెండ్ల మనోహర్‌పైనే పవన్ కల్యాణ్‌కు నమ్మకం ఎందుకు? అసలు వీరి దోస్తీ వెనుక మర్మం ఏమిటి? ఈ స్నేహం... కలకాలం ఉంటుందా? లేకపోతే పవన్ కల్యాణ్ వెన్నుపోటుకు గురవుతారా? లేక క్యాస్ట్ ఈక్వెషన్స్ వీరి మధ్య చిచ్చు రేపుతోందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

అన్నీ తానై వ్యవహరిస్తున్న నాదెండ్ల

ప్రజల పక్షాన ప్రశ్నిస్తామంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన. ఈ జనసేనకు రథసారథి పవన్ కల్యాణ్ మాత్రమే. ఒక్కడితో మెుదలైన ఈ పయనంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ పార్టీని ఆయన అభిమానులు కాపు కాశారు. అయితే పవన్ కల్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలను మేనేజ్ చేయడం కష్టంగా మారింది. దీంతో పవన్ రాజకీయాలకు పనికిరాడని.. కేవలం గెస్ట్ పొలిటీషియన్ మాత్రమేనని విమర్శలు సైతం వినిపించాయి. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ప్యాకేజీ కోసమే పార్టీని ఏర్పాటు చేశారంటూ ఘోరంగా అవమానించిన సంగతులు సైతం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్‌కు కొండంత అండగా నిలిచారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అంతేకాదు పవన్ కల్యాణ్‌కు అత్యంత నమ్మకస్తుడు. అందుకే జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఉన్నప్పటికీ ఆయనను కేవలం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కానీ నాదెండ్ల మనోహర్‌ను మాత్రం పీఏసీ చైర్మన్‌గా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నాదెండ్ల మనోహర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. రాష్ట్ర స్థాయిలో కాదు ఏకంగా గ్రామస్థాయి వరకు వెళ్లి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇలా జనసేన పార్టీ వ్యవహారాలన్నీ నాదెండ్ల ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు.

నాదెండ్లపై తొలుత వ్యతిరేకత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్‌ను వేరెవరు కలవనీయకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుపడుతున్నారనే విమర్శలు సైతం వినిపించాయి. అంతేకాదు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో గ్రౌండ్ వర్క్ చేసిన కొణిదెల నాగబాబును కేవలం ఒక కార్యకర్తలా పవన్ కల్యాణ్ చూడటంపై మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలో అరటిపండులా నాగబాబును పరిగణిస్తున్నారంటూ మండిపడ్డారు కూడా. ఒక గవర్నర్‌ను కలవాలన్నా.. అటు బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ కావాలన్నా నాదెండ్ల మనోహర్‌తోనే పవన్ కల్యాణ్ కలిసేవారు. కానీ నాగబాబును మాత్రం కలుపుకుని తీసుకెళ్లేవారు కాదు. ఇదంతా నాదెండ్ల మనోహర్ కుట్ర అంటూ కూడా విమర్శలు వినిపించాయి. అయితే అభిమానుల ఆవేశం.. బయట జరుగుతున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. తన సోదరుడు నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో అభిమానులు, జనసైనికులు శాంతించారు.

అంతా నా ఇష్టం అంటున్న నాదెండ్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల మనోహర్ రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గం నుంచి 2004,2009 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. దీంతో నాదెండ్ల మనోహర్‌పై సొంత పార్టీ నేతలే విమర్శించారు. నాదెండ్లకు ఎందుకంత ప్రాధాన్యం అని ప్రశ్నించారు. అంతేకాదు ఇతర పార్టీలు పలు విమర్శలు సైతం చేశాయి. నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయన టీడీపీ కోవర్టు అని కూడా విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్‌ను నాదెండ్ల మనోహర్ తండ్రి వెన్నుపోటు పొడిచారని అలాంటిది పవన్ కల్యాణ్‌కు ఎదురుకాకుండా చూసుకోవాలంటూ కొందరు హితబోధ సైతం చేశారు. అంతేకాదు పార్టీ నాయకులను పవన్ కల్యాణ్‌ను కలవనీయకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుపడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎవరు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నా తనతో చెప్పుకోవాలని నాదెండ్ల అనడంతో పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కమిటీల నియామకం, ఇన్ చార్జ్‌ల నియామకం, అన్నీ నాదెండ్ల ఇష్టప్రకారమే జరుగుతున్నట్టు గుసగుసలు సైతం వినిపించాయి.

అందుకే కీలక బాధ్యతలు

పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వాస్తవంగా తన పదవికి సరైన న్యాయం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్‌కు వచ్చే ఎన్నికల్లో నిలబడేందుకు ఆర్థిక సామర్థ్యం సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ షూటింగ్‌ల నుంచి వచ్చి అకస్మాత్తుగా మీటింగ్‌లు పెట్టి హడావిడి చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడంలేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవలపై ఆయన కాలు పెట్టడంతో రాజకీయాలకు పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పర్యటిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల గోడు విన్నా, మరణించిన రైతులకు, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు ఇస్తున్నా, విజయనగరం వెళ్లి నియోజకవర్గాల సమీక్షలు ఇలా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల కష్టాలను గుర్తించిన పవన్ కల్యాణ్ అదే సమయంలో ఆయనపై వస్తున్న విమర్శలను సైతం తిప్పికొట్టారు. జనసైనికులు ఎవరూ నాదెండ్ల మనోహర్‌ను విమర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారు. విమర్శిస్తే వారంతా వైసీపీ కోవర్టులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి వారు పార్టీకి అవసరం లేదని కూడా తేల్చి చెప్పేశారు. దీంతో నాదెండ్ల మనోహర్‌ అంటే పవన్ కల్యాణ్‌కు విపరీతమైన నమ్మకం అని అంతా అంటున్నారు.



Next Story

Most Viewed