అంతర్వేది రథం శకలాల నిమజ్జనం వాయిదా

by Thanuru Gopichand |

పాత రథం శకలాల నిమజ్జనాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ ధార్మిక సంఘాలు.

అంతర్వేది రథం శకలాల నిమజ్జనం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్వేది (Antharvedi) పాత రథ శకలాలను నేడు గోదావరిలో నిమజ్జనం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తొలుత గోదావరి, సముద్రం కలిసే సంగమం అయిన అన్నాచెల్లెల్ల గట్టు వద్ద నిమజ్జనం చేయాలని అనుకున్నారు. దేవాదాయ, పోలీసు, రెవెన్యూ శాఖలు అందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చింది. విస్తృత అభిప్రాయాలను ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం సేకరించాలని నిర్ణయించింది. అనంతరం తుది తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొంది.

అయితే అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథం 2020 సెప్టెంబర్ 5న అగ్నికి ఆహుతి (Chariot Fire Accident) అయ్యింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించింది. ఇప్పటికీ ఈ కేసు వ్యవహారం విచారణ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆగమ పండితుల సూచనతో పలు పూజా కార్యక్రమాల తరువాత నిమజ్జనం జరగనుంది. ఈ విషయం డీజీపీ దృష్టిలో కూడా ఉంది. అయితే రథం శకలాలు అలాగే ఉంటే అరిష్టమని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

అయితే మరోవైపు రథ శకలాల నిమజ్జనాన్ని ఆపివేయాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా ఇచ్చాయి. శకలాలను యధాతథంగా భద్రపరచాలని కోరాయి. ఒకవేళ రథ శకలాలను నిమజ్జనం చేస్తే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించాయి. నిందితులను శిక్షించకుండా ఆధారాలను మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హిందూ ధార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

దీనిపై ఆలయాధికారులు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం జరిగిన దుర్ఘటనలో లక్ష్మీ నరసింహ స్వామి వారి తాలుకు రథం అగ్నికి ఆహుతై దాని శకలాలు మిగిలాయన్నారు. అవి అదే విధంగా ఉండడం అరిష్టమని పండితులు చెబుతున్నారన్నారు. వారి సూచనల మేరకు రథాన్ని నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. అందుకు పోలీసు శాఖ నుంచి కూడా అనుమతులు పొందామంటున్నారు. శాస్త్రోక్తంగానే శకలాల నిమజ్జనం జరపాలని నిర్ణయించామంటున్నారు.

Next Story