ఈ ఐఏఎస్ అధికారుల వివాహం అందరికీ ఆదర్శం...

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-22 03:32:55  IST  )

పెళ్లి.. ఒకప్పుడు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక. కానీ ఈ రోజుల్లో మాత్రం..

ఈ ఐఏఎస్ అధికారుల వివాహం అందరికీ ఆదర్శం...
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి.. ఒకప్పుడు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక. కానీ ఈ రోజుల్లో మాత్రం పెళ్లి అనేది ఉన్నోళ్ల ఇంటి పండుగ.. లేనోళ్లకు నెత్తిమీద గుదిబండగా మారిందనడంలో సందేహం లేదు. నేటి పెళ్లిళ్లకు అవుతున్న ఖర్చులు అలా ఉన్నాయి. పోనీ ఉన్నంతలో పెళ్లి చేద్దాం అని అనుకున్నా.. బంధువులు, మిత్రులు ఏమనుకుంటారోనన్న మొహమాటంతో తాహతకు మించి అప్పులు చేస్తున్నారు. కల్యాణమండపం రెంట్, డెకరేషన్, భోజనాలు, కేటరింగ్, ఫొటోగ్రఫీ, డ్యాన్సులు, మ్యాచింగ్ కాస్ట్యూమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్.. ఒక్కమాటలో చెప్పాలంటే నేటి రోజుల్లో జరుగుతున్న పెళ్లిళ్లు ఇంటి వేడుకలా కాకుండా.. ప్రాజెక్టుల్లా కనిపిస్తున్నాయి. ఆ పెళ్లిళ్లకు పెట్టే ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్న ఆలోచన మనలో చాలామందికి లేకపోయింది.

కానీ.. ఈ ఆడంబరాలన్నింటికీ దూరంగా ఓ ఐఏఎస్ జంట ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. జీవితంలో ఒకే ఒక్కసారి బంధువులందరి సమక్షంలో చేసుకునే పండుగ వివాహం. ఆ వివాహం కలకాలం గుర్తుండిపోవాలని లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ఈ జంట ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మలు కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో శుక్రవారం (నవంబర్ 21) వివాహం చేసుకున్నారు. విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో దండలు మార్చుకుని నూతన బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. విశాఖ డీఐజీ బాలకృష్ణ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రెండు రాష్ట్రాలు, వేర్వేరు ఐఏఎస్ క్యాడర్లకు చెందిన వీరిద్దరిదీ అరేంజ్డ్ మ్యారేజ్ అని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story