ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం : మాజీ ఉపరాష్ట్రపతి

by Thanuru Gopichand |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరోక్షంగా చురకలు పెట్టిన వెంకయ్య నాయుడు.

ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం : మాజీ ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉచిత పథకాలకు తాను వ్యతిరేకం అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. విజయవాడ సీనియర్ సిటిజన్స్ ఫోరం (Senior Citizens Forum) సభ్యులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఫోరం ఆధ్వర్యంలో నడుపుతున్న పెద్దల ఆశ్రమం పేరిట ఉన్న వృద్ధుల సంక్షేమా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడున్న పెద్దలతో కలిసి ఉపాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజాన్ని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. సమాజం కోసం, తమ కన్నపిల్లల కోసం యావత్ జీవితాన్ని పెద్దలు త్యాగం చేస్తారన్నారు. మలి సంధ్యలో వారు ప్రశాంతంగా గడిపే వాతావరణం ఎంతైనా అవసరం అని తెలిపారు. 1991 నుంచి ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న జంపాల అప్పారావు, వంగర సూర్యనారాయణ మూర్తి, డాక్టర్ కెజె ప్రసాద్, చుక్కపల్లి కుశలవ చొరవ స్ఫూర్తిదాయకమైందని అభినందించారు.

ఒక సమాజంలో తమ పెద్దలతో వ్యవహరించే విధానం వారి సంస్కృతి, విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. మన పెద్దలు జ్ఞానులే కాదు అనుభవ సంపన్నులు కూడా అన్నారు. మలిసంధ్యలో గౌరవం, ఆప్యాయత, శ్రద్ధ, గౌరవంతో జీవించేందుకు వారు అర్హులని స్పష్టం చేశారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం యువకులతో సహా అందరి పవిత్ర కర్తవ్యంగా భావించాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రాచీన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవటంతో పాటు వారికి సహకారాన్ని అందించడం పౌర సమాజం, సామాజిక సంస్థలు సహా ప్రతి ఒక్కరి కనీస విధిగా పేర్కొన్నారు.

ఉచిత పథకాల గురించి మాజీ రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రభుత్వాలు పేదలకు ఉచిత పథకాలను (Freebies) అమలు చేస్తున్నాయని అన్నారు. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ధనవంతులకు ఉచిత బస్సు సౌకర్యం అనవసరం అని స్పష్టం చేశారు. పేదలకు మాత్రమే ఉచిత సౌకర్యం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదని.. కేవలం ప్రజాహితం కోసం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.

Next Story