ఉచిత విద్య ఇంకెంత దూరం? ‘నాడు–నేడు’ పేరిట వేల కోట్ల వ్యయం

by Disha Web Desk 7 |
ఉచిత విద్య ఇంకెంత దూరం? ‘నాడు–నేడు’ పేరిట వేల కోట్ల వ్యయం
X

మొన్నటి కరోనా కల్లోలంలో తోపు.. తురుమని చెప్పుకునే దేశాలు విలవిల్లాడాయి. అగ్ర రాజ్యమని గొప్పలు పోయే అమెరికాకు పక్కలో బల్లెంలా ఉండే అతి చిన్న దేశం క్యూబా వైద్యులను పంపి ఆదుకుంది. క్యూబాలో ఇంటికో మెడిసిన్ ​విద్యార్థి ఉన్నారంటే విద్య పట్ల ఆ దేశానికి ఉన్న అంకితభావం అలాంటిది. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏలిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్ ​కబంధ హస్తాల్లో పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలపై పిచ్చికుక్క ముద్ర వేసి నాశనం చేశాయి. చివరకు అవి పేద విద్యార్థులు చదువుకునేవిగా మార్చేశాయి. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల లాభాలు తగ్గకుండా ఫీజు రీయింబర్స్​మెంటు, అమ్మఒడి పేరుతో నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. వైసీపీ సర్కారు వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. కొన్ని అపసవ్య నిర్ణయాల వల్ల విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది. నిలదీయాల్సిన ప్రతిపక్షానికి ప్రైవేటు విద్యా సంస్థలపై మోజు తగ్గలేదు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అంటూ విద్యారంగ నిపుణులు నోటిమీద వేలేసుకుంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ రంగంలో విద్యను బలోపేతం చేస్తామని వైసీపీ సర్కారు ఎన్నికల ముందు హామీనిచ్చింది. ప్రతి ఒక్కరికి ఉచితంగా కేజీ టూ పీజీదాకా విద్యను అందించే బాధ్యతను తీసుకుంటానని నాడు సీఎం వైఎస్ జగన్​ భరోసానిచ్చారు. అందులో భాగంగానే కుటుంబానికో విద్యార్థికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను ప్రోత్సహిస్తూ ఈ పథకంలో 25 శాతం నిధులను నేరుగా వారి ఖాతాలకు వేస్తామని ప్రకటించారు. ఇంకోవైపు నాడు–నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.

రెండు విడతలుగా మొత్తం 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో రూ.3,650 కోట్లు వెచ్చించారు. రెండో దశకు రూ.4,535 కోట్లు కేటాయించారు. పాఠశాలల క్రమబద్ధీకరణ పేరుతో కొన్ని స్కూళ్లను విలీనం చేశారు. మూడో తరగతి విద్యార్థి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న స్కూలుకు వెళ్లే దురవస్థకు గురిచేశారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా మిగులు ఉన్నట్లు చూపించారు. అప్పు కోసం ప్రపంచ బ్యాంకు విధించిన షరతుకు లోబడి ఉపాధ్యాయులను కుదించే నిర్ణయాలను అమలు చేస్తున్నారు.

ఎల్‌కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమం

కన్న బిడ్డల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించాలనే కోరికను తల్లిదండ్రుల్లో కార్పొరేట్​శక్తులు బలంగా రుద్దాయి. ఆ మోజులో పడిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ సంతానాన్ని కార్పొరేట్​ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. కన్నవాళ్లను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్​కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. బాల్యంలో కనీసం ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన ఉండాలని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. కేంద్రం నిర్దేశించిన నూతన విద్యా విధానంలోనూ దీన్ని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మాతృభాషలో చదువుకునేందుకు ఓ ఆప్షన్​ అయినా ఇవ్వాలని సూచించినా సర్కారు లెక్కపెట్టలేదు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు ఇవ్వకుండానే విద్యా ప్రణాళికను అమలు చేశారు. దీంతో పరభాషలో పాఠాలు చెప్పలేక ఉపాధ్యాయులు తడబడుతున్నారు. పాఠాలు అర్థంగాక డ్రాపవుట్స్​ పెరుగుతున్నారు.

మూడో తరగతి నుంచే టోఫెల్

తాజాగా మూడో తరగతి నుంచే టోఫెల్‌కు సంసిద్దత పాఠ్యాంశాలు బోధించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఎంసెట్, నీట్​అంటూ నీలిగింది. అయితే ఇంజనీరో, డాక్టరు తప్ప మిగతా చదువులు పనికిమాలినవనే ముద్ర వేసింది. ప్రస్తుత సర్కారు చదువుకున్న ప్రతీ ఒక్కర్నీ విదేశాలకు పంపాలనే కోరికలకు ఊతమిస్తోంది. దేశంలో ఎక్కడా లేని వింత పోకడలను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం యాత్రలో మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విద్యాభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీకి అధికారమిస్తే చైతన్య, నారాయణ విద్యా సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని అధికార పార్టీ కార్యకర్తలు దునుమాడుతున్నారు. పన్నెండో తరగతి దాకా ప్రతీ విద్యార్థికి ఉచితంగా చదువు అందిస్తామని మాత్రం చెప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే ప్రతి విద్యార్థి చదివేటట్లు ప్రోత్సహించడం లేదు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షానిది ఒకే దారి అన్నట్లుందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశానికే ఆదర్శం.. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు

ఢిల్లీలో ఆప్​ప్రభుత్వం కార్పొరేట్​ విద్యా సంస్థలను తలదన్నే రీతిలో ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ​ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​తో స్కూళ్లను సందర్శించి అబ్బురపడ్డారు. ప్రధానోపాధ్యాయులు తన సీట్లో ఉంటే ముఖ్యమంత్రులిద్దరూ ఎదురుగా కుర్చీల్లో కూర్చోవడం అక్కడ ఉపాధ్యాయులకు దక్కే గౌరవం ఎలాంటిదో ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం వాళ్లను అయినదానికి కానిదానికి రాచి రంపాన పెడుతోంది. గాడి తప్పిన ఉపాధ్యాయ వర్గాన్ని సరైన మార్గంలో నడిపించడానికి బదులు కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆయా సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ చర్యలన్నీ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు.ఉచిత విద్య ఇంకెంత దూరం? ‘నాడు–నేడు’ పేరిట వేల కోట్ల వ్యయం

Next Story

Most Viewed