చారిత్రక ఘట్టం: నేడు పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు!

by Naga Rani Yarlagadda |

స్వతంత్ర భారత సమాఖ్య చరిత్రలో తొలిసారి కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతి చట్టబద్ధత బిల్లు నేడు లోక్ సభ ముందుకు రానుంది.

చారిత్రక ఘట్టం: నేడు పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ భారత పార్లమెంటరీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. రాష్ట్ర ప్రజల 12 ఏళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్రహోంశాఖ నేడు లోక్ సభలో ప్రవేశ పెట్టి, మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలుపనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 ప్రకారం, హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇందుకోసం విభజన చట్టంలోని సెక్షన్ 5(2) కు సవరణ చేస్తున్నారు.

స్వతంత్ర భారత సమాఖ్య చరిత్రలో తొలిసారి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారు. దీనిపై సుమారు రెండు గంటల పాటు చర్చ జరుగుతుంది. అనంతరం మూజువాణి ఓటు (Voice Vote) ద్వారా ఆమోదించనున్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, గురువారం (ఏప్రిల్ 2) ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. అక్కడ కూడా చర్చ అనంతరం ఆమోదం పొందుతుంది. ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, కేంద్ర కేబినెట్ దీనికి పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ (Post-facto Ratification) అంటే ముందస్తుగా జరిగిన నిర్ణయానికి అధికారిక ఆమోదం తెలుపుతుంది. కేబినెట్ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది. చివరిగా.. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనితో అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుంది. సాధారణంగా ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది. కానీ, పార్లమెంటులో ప్రత్యేకంగా ఒక బిల్లు ద్వారా రాజధానిని ప్రకటించడం స్వతంత్ర భారత సమాఖ్య చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం వల్ల భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి అంశాలపై ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అమరావతికి గట్టి రక్షణ లభిస్తుంది.

Next Story