ఆయన గాత్రమంటే మాకు ఎంతో ఇప్టం.. గరిమెళ్ల మృతి పట్ల స్పందించిన మాజీ ఉప రాష్ట్రపతి

by Ramesh Goud |

ఆయన గాత్రమంటే మాకు ఎంతో ఇష్టం అని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Krishna Prasad) ను ఉద్దేశించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President N. Venkaiah Naidu) అన్నారు.

ఆయన గాత్రమంటే మాకు ఎంతో ఇప్టం.. గరిమెళ్ల మృతి పట్ల స్పందించిన మాజీ ఉప రాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆయన గాత్రమంటే మాకు ఎంతో ఇష్టం అని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Krishna Prasad) ను ఉద్దేశించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President N. Venkaiah Naidu) అన్నారు. సంగీత విద్వాంసుడు గరిమెళ్ల మృతి పట్ల ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని (Thallapak Annamacharyudu) సంకీర్తనలను స్వరపరచి, శ్రీవారి భక్తులకు చేరువ చేసిన ప్రముఖ గాయకుడు (Singer) గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పరమపదించారని తెలిసి విచారించానని అన్నారు. అలాగే వ్యక్తిగతంగా ప్రతి రోజు నా ఉదయం వారి కీర్తనలతోనే మొదలౌతుందని తెలిపారు.

వారి అన్నమయ్య కీర్తనలు వింటూ ఉత్తేజాన్ని పొందుతానని అన్నారు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా వారి గాత్రమంటే ఎంతో ఇష్టమని చెప్పారు. వారి గళం నుంచి జాలువారిన అన్నమయ్య సంకీర్తన స్రవంతిలో తడిసి పులకిస్తున్న శ్రోతలు దేశవిదేశాల్లో లక్షలాదిగా ఉన్నారని తెలియజేశారు. ఇక 60 ఏళ్ల సంగీతయాత్రలో ఎన్నో సన్మానాలు, బిరుదులు సహా అన్నమయ్య ఆశీస్సులను, తిరుమల శ్రీనివాసుని కృపను పరిపూర్ణంగా పొందిన భాగ్యశాలి ఆయన అని గరిమెళ్లను వెంకయ్య నాయుడు కీర్తించాడు. 16 ఏళ్ళ వయసు నుంచి అన్నమయ్య సంకీర్తనా గానాన్ని ఓ ఆధ్యాత్మిక యజ్ఞంలా నిర్వహిస్తున్న గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీత యాత్రలో ఇటీవల “షష్ఠ్యబ్ది”ని కూడా పూర్తి చేసుకున్న సందర్భంలో వారితో మాట్లాడి, అభినందించానని గుర్తు చేసుకున్నారు.

ఇంతలోనే వారు ఇక లేరన్న వార్త విచారకరమని అన్నారు. తిరుమల శ్రీనివాసుని కృపతో, వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి రాసుకొచ్చారు. కాగా ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం గుండె పోటుతో తిరుపతిలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గరిమెళ్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా సేవలు అందించారు. ఆయన 600కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు.

Next Story