బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-19 12:12:56  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో (AP Weather Report) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.

రేపు (జులై 20) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

తెలంగాణ విషయానికొస్తే.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులు భారీ వర్షాలు (Telangana Weather) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains), మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Next Story