భూ కేటాయింపులపై మండలిలో వాడి - వేడి చర్చ.. వరుదు కల్యాణి ఆరోపణలపై లోకేశ్ ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-12 06:57:45  IST  )

ఏపీ అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు రెండోరోజుకు చేరుకున్నాయి. జీరో అవర్ లో మండలిలో భూ కేటాయింపులపై అధికార - ప్రతిపక్షాల మధ్య వాడి-వేడిగా చర్చ జరిగింది.

భూ కేటాయింపులపై మండలిలో వాడి - వేడి చర్చ.. వరుదు కల్యాణి ఆరోపణలపై లోకేశ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు రెండోరోజుకు చేరుకున్నాయి. జీరో అవర్ లో మండలిలో భూ కేటాయింపులపై అధికార - ప్రతిపక్షాల మధ్య వాడి-వేడిగా చర్చ జరిగింది. గతేడాది ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం తక్కువ అద్దెకే భూములను ఇచ్చింది. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహేజా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని, ఆ కంపెనీకి భూములు ఎలా ఇస్తారని అడిగారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నాకే 99 పైసలకే భూములిచ్చామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మాధవరావు అడిగిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయడంతో.. మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రహేజా బిల్డింగ్స్ లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వాటితో వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అన్ని వనరులు ఉన్నా.. వెనుకబడిపోయిందన్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని, స్థానికంగానే ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని భూములను తక్కువకే లీజుకిచ్చామని వివరించారు. 99 పైసలకు భూముల్ని మా చుట్టాలకేమైనా ఇచ్చామా అని అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. భూములు లీజుకు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

వరుదు కల్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో.. అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. విశాఖ భూములను కేవలం 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు లీజుకు ఇచ్చామన్నారు. ఒడిశాకు ల్యాండ్ ఇచ్చినట్లు నిరూపిస్తే.. తన స్టేట్మెంట్ ను విత్ డ్రా చేసుకుంటామన్నారు. రహేజా మైండ్ స్పేస్ కు ఆనాడు చంద్రబాబు నాయుడు 97 ఎకరాలు కేటాయించారని లోకేశ్ గుర్తు చేశారు.

Next Story