ఏపీలో ఇంధన కొరత..! కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్న వైసీపీ

by Ramesh Naini |

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగింది.

ఏపీలో ఇంధన కొరత..! కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్న వైసీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగింది. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని, ప్రజలకు కనీసం ఇంధనం కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విజయవాడలో వినూత్న నిరసన..

ఇంధన కొరతను నిరసిస్తూ విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్‌లోని పెట్రోల్ బంకు వద్దకు ఓ ఆటోను తాడుతో లాక్కుంటూ వచ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

సంక్షోభానికి ప్రభుత్వమే కారణం: సజ్జల

మరోవైపు తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజా జీవనం స్తంభించిపోవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పక్కనున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ, దేశంలో మరెక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నాలుగైదు రోజులుగా కొరత ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి పనులకు పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరుతూ ఈ నెల 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారని, దాని వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని సజ్జల ఆరోపించారు. అధికారుల ఆదేశాలు చట్టవిరుద్ధమని, వాటిని వెనక్కి తీసుకోవాలని సాక్షాత్తూ కేంద్రమే సూచించిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించిన సజ్జల.. డీజిలే తీసుకురాలేని వారు, ఇక రాష్ట్రానికి పరిశ్రమలను ఎలా తీసుకొస్తారని ఎద్దేవా చేశారు.

Next Story