- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధిని అడ్డుకుంటే సహించం.. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా అటవీ క్లియరెన్స్‌ల అంశంపై చర్చ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ ముఖ్యం అయినప్పటికీ, దాని సాకుతో గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. పాపికొండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్‌వెల్స్ వంటి కనీస అవసరాలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇళ్లను మంజూరు చేసినప్పుడు, అటవీ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడమేంటి? అని అధికారులను ప్రశ్నించారు. గిరిజనులకు కనీస అవసరాలైన నీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
రోడ్ల మరమ్మతులపై సీరియస్
పాత రహదారులపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికి కూడా అభ్యంతరాలు తెలపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల వ్యవహారశైలిపై తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ ధోరణిని తక్షణమే మార్చుకోవాలని హెచ్చరించారు. అటవీ శాఖ సంబంధిత సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నివేదించాలని సూచించారు. పాపికొండల ప్రాంత సమస్యలను ఏలూరు జిల్లా కలెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) కలిసి కూర్చుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా సాగాలని, ఎక్కడా పనులు కుంటుపడకూడదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చారు.






