కుందేరు వాగు ఆక్రమణలపై బాపట్ల కలెక్టర్ సీరియస్..

by Bhoopathi Nagaiah |

కుందేరు డ్రైన్‌లో ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి రెవెన్యూ, డ్రైనేజీ అధికారులను ఆదేశించారు.

కుందేరు వాగు ఆక్రమణలపై బాపట్ల కలెక్టర్ సీరియస్..
X

దిశ ప్రతినిధి, బాపట్ల: కుందేరు డ్రైన్‌లో ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి రెవెన్యూ, డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో కుందేరు వాగు ఆక్రమణలు తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.వెంకట మురళి మాట్లాడుతూ కుందేరు వాగు జిల్లాలో బాపట్ల, చీరాల, చిన్నగంజాం, వేటపాలెం మండలాలలో ప్రవహిస్తుందన్నారు. ఆయా మండలాల్లోని కుందేరు వాగు సర్వే పై తహసీల్దార్లను ఆరా తీశారు.

కుందేరు వాగు బాపట్ల మండలంలో 97.20 ఎకరాలు, చీరాల మండలంలో 267 ఎకరాలు, చినగంజాం మండలంలో 460 ఎకరాలు, వేటపాలెంలో 650 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. వాగుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వాగుకు ఇరువైపులా ఉద్యానవన పంటలు, వ్యవసాయ పంటలు వేసిన వారితో మాట్లాడి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగుపై కట్టడాలు ఉంటే వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుందేరు వాగులో ఉన్న చెట్ల వేలం పై సంబంధిత డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆరా తీశారు. చెట్ల వేలంను త్వరితగతిన పూర్తి చేసి వాటిని తొలగించాలని ఆయన ఆదేశించారు. వేలం ద్వారా వచ్చిన నిధులను కాలువ మరమ్మతులకు ఖర్చు చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, డ్రైనేజ్ శాఖ ఇంజనీర్ మురళి కృష్ణ, బాపట్ల తహసీల్దార్ సలీమా, చీరాల తహసీల్దార్ గోపికృష్ణ, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్ రావు, వేటపాలెం తహసీల్దార్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

Next Story