- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారానికి గ్రీన్ సిగ్నల్
దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయనున్నాయి. జాయింట్ వెంచరుగా ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే అనకాపల్లి జిల్లాలో కర్మాగారం ఏర్పాటు ఊపందుకోనుంది. మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల పర్ ఆనమ్ (MTPA) సామర్థ్యంతో దాదాపు 80,000 కోట్ల రూపాయలతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. దీని సామర్థ్యాన్ని భవిష్యత్తులో 24 మిలియన్ టన్నుల పర్ ఆనమ్ వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 2,200 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మలుపు కానుందనే అభిప్రాయం వాణిజ్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
ఛత్తీస్ ఘడ్ లోని బైలదిలా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే పైప్‌లైన్ ఏర్పాటు విషయంలో ఎన్‌ఎమ్‌డిసి (NMDC) అభ్యంతరాలు పరిష్కరించబడటంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. అదనపు పైప్‌లైన్‌కు అనుమతి లభించడం వలన ఇనుప ఖనిజం సరఫరా సులభతరం కానుంది. సాధారణంగా రెండేళ్ల నుంచి నాలుగేళ్లు పట్టే అనుమతుల ప్రక్రియను 14 నెలల్లో పూర్తి చేయడం పట్ల పరిశ్రమ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అనుమతుల జారీలో అందించిన సహకారం, వేగానికి గానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణహిత రవాణా పద్ధతుల ద్వారా కాలుష్యం తగ్గుతుందని, ఇది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.






