- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు: మరో ఏడాది పొడిగింపు!
వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు శుభవార్త అందించింది. జర్నలిస్టుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రస్తుతం అమలవుతున్న 'వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్' (Working Journalists Health Scheme) గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని 2026-2027 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా అక్రిడిటేషన్ కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులకు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత (Cashless) చికిత్స అందుతుంది. జర్నలిస్టులతో పాటు వారి జీవిత భాగస్వామి, పిల్లలు, వారిపై ఆధారపడిన వారికి ఈ వైద్య సేవలు వర్తిస్తాయి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలోనే, గతంలో ఉన్న మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే ఈ సేవలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయం..
సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) చేసిన అభ్యర్థన మేరకు, రాష్ట్ర గవర్నర్ ఆదేశానుసారం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఐ&పీఆర్ విభాగం ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టు కుటుంబాలకు భద్రత లభించనుంది. ఇప్పటికే గత 2015-16 సంవత్సరం నుండి ఈ పథకం నిరంతరాయంగా పొడిగించబడుతూ వస్తోంది.






