- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాంధ్రవాసులకు ప్రభుత్వ సంక్రాంతి కానుక
ఉత్తరాంధ్రవాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం ప్రజల ఐదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ ప్రాంతవాసుల జీవనరేఖగా భావించే 'చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB)' పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో కూటమి ప్రభుత్వం ఈ నెల జనవరి 10న దీనిని ప్రజలకు అంకితం చేయనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన పాత వంతెన 2022లో శిథిలావస్థకు చేరడంతో భారీ వాహనాలను రైల్వే శాఖ అధికారులు నిషేధించారు. అప్పటి నుంచి రాజాం, పాలకొండ, ఒడిశా వైపు వెళ్లే ప్రయాణికులు అదనంగా 50 కిలోమీటర్లు చుట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పనులు నత్తనడకన సాగగా, ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలతో యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయించి సంక్రాంతి కానుకగా అందిస్తోంది.
ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల సుమారు 20 మండలాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. గతంలో విశాఖ నుంచి రాజాం వెళ్లడానికి 5 గంటల సమయం పట్టగా.. ఇకపై ఆ ప్రయాణం సాఫీగా సాగనుంది. ముఖ్యంగా అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లే రోగులకు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. చిలకపాలెం, గరివిడి మీదుగా తిరుగుతూ శారీరకంగా, ఆర్థికంగా నలిగిపోయిన సామాన్య ప్రయాణికులకు, ఆర్టీసీ బస్సులకు ఈ వంతెన పునఃప్రారంభం కొత్త ఊపిరిని పోయనుంది. వ్యాపారపరంగా కీలకమైన ఒడిశా సరిహద్దు మార్గం కావడంతో స్థానిక వాణిజ్యం కూడా మళ్లీ పుంజుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పండుగ వేళ సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో అధికారులు అప్రోచ్ రోడ్లు, సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. గతంలో కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ 'కన్నీటి ప్రయాణం' ముగిసిందని, తమ చిరకాల వాంఛ నెరవేరిందని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 10న ప్రారంభం కానున్న ఈ వంతెన మూడు జిల్లాల అభివృద్ధికి చిహ్నంగా నిలవడమే కాకుండా.. పాలకుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.






