కదిరిలో పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు దుర్మరణం.. మరో ఆరుగురికి?

by Naga Rani Yarlagadda |

కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు.

కదిరిలో పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు దుర్మరణం.. మరో ఆరుగురికి?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు గాయపడగా.. స్థానికులు, పోలీసులు వారిని రక్షించి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు పేలడమే కారణమని భావిస్తున్నా.. పోలీసులు, క్లూస్ టీమ్ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించాయి. ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలను అమర్చడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ కాదని, నిల్వ ఉంచిన డిటోనేటర్లేనని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. జనావాసాల మధ్య పేలుడు పదార్థాలను ఎందుకు నిల్వ చేశారు? ఆ ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించి నమూనాలను సేకరించింది. ఈ అక్రమ నిల్వలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.

Next Story