జనసేన తరపున గంటా పోటీ?.. ఆ నియోజకవర్గంపై ఫోకస్

by Disha Web Desk 2 |
జనసేన తరపున గంటా పోటీ?.. ఆ నియోజకవర్గంపై ఫోకస్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎట్టి పరిస్ధితుల్లోనూ సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. తన రాజకీయ భవిష్యత్ పై సన్నిహితులతో చర్చించేందుకు రుషికొండలో గంటా గురువారం ఆత్మీయుల సమావేశాన్ని నిర్వహించారు. గత ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి విజయం సాధించిన ఆయన పార్టీ అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా అంటూ రాజీనామా చేశారు. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు.

తొందరపడి ఓ కోయిల...

కొద్ది నెలల క్రితం తిరిగి యాక్టివ్ అయిన ఆయన తాను ఈ సారి విశాఖ ఉత్తర నుంచి పోటీ చేయనని విలేకరుల సమావేశంలో పార్టీ అధిష్టానం అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రకటించేశారు. ఉత్తర కాకుండా తాను గతంలో పోటీ చేసిన నియోజక వర్గాలలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తానని హింట్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన గతంలో గెలిచిన ఆనకాపల్లి, చోడవరం అభ్యర్ధుల ప్రకటన పూర్తి అయినందున భీమునిపట్నం ఒక్కటే మిగిలింది. తెలుగుదేశం అధిష్టానం అందుకు అంగీకరించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యానారాయణపై చీపురుపల్లి నుంచి పోటీచేయాల్సిందే అని తెగేసి చెప్పింది.

చిరు ద్వారా పవన్ పై ఒత్తిడి ?

పార్టీలకు అతీతంగా సన్నిహితుడైన బొత్సపై పోటీ చేసే ఉద్దేశం గంటాకు లేదు. దీంతో గంటా పునరాలోచనలో పడి ఎదో విధంగా భీమిలి దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం కాదంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించి భీమిలి టికెట్ తెచ్చుకోవాల్సిందిగా ఆత్మీయసమావేశంలో కొందరు సూచించారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో పవన్ పై భీమిలి సీటు కోసం ఒత్తిడి చేయాల్సిందిగా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. శ్రేయోభిలాషుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమావేశం నిర్వహించానని, వాటిని శుక్రవారం పార్టీకి తెలియజేస్తానని ఈ మేరకు ఆయన వాట్సప్ గ్రూప్‌లలో మేసేజ్ పెట్టారు.


Next Story

Most Viewed