- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఐడీ చీఫ్ సంచలన ట్వీట్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుపై (Raghurama Krishna Raju) సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుపై (Raghurama Krishna Raju) సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) సంచలన ట్వీట్ చేశారు. ఒక వార్తా కథనాన్ని షేర్ చేస్తూ "దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే. మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా. CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి." అని వ్యాఖ్యనించారు. అయితే రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో పీవీ సునీల్ కుమార్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆరోపణల నేపథ్యంలో విచారణను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో రఘురామకృష్ణ రాజుపై సీబీఐ విచారణకు లైన్ క్లియర్ కావడంతో సునీల్ కుమార్ స్పందించారు. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుంచి తొలగించాలని కోరారు. తద్వారా చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండదు.. చట్టం అందరికీ సమానం అనే సంకేతం వెళ్లాలనే అభిప్రాయాన్ని పీవీ సునీల్ కుమార్ వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుపై వైసీపీ హయాంలో ఎంపీగా ఉన్నప్పుడు సీబీఐ కేసు నమోదైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాని అనుబంధ బ్యాంకుల నుంచి రఘురామకృష్ణ రాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీలు రుణం పొందాయి. ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట రుణాన్ని అందుకున్నాయి. అయితే నిధులను మళ్లించి వాటిని ఎఫ్డీలుగా మార్చి, ఆ ఎఫ్డీలను పెట్టి తిరిగి రుణాన్ని పొందారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వడ్డీ కూడా చెల్లించడం లేదని పేర్కొంటూ బ్యాంక్ ఆరోపించింది. తమ వద్ద తనఖా పెట్టిన భూములను మోసూరితంగా అమ్ముకున్నారని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి బొగ్గును తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై సీబీఐ విచారణను చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. దర్యాప్తు నిలిపివేయాలని రఘురామకృష్ణ రాజు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వాటిని ఎత్తేసింది. ఎఫ్ఐఆర్ నమోదుకు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేమని తెలిపింది. దీంతో మరోసారి బ్యాంక్ ఫ్రాండ్, ఫోర్జరీ కేసులో దర్యాప్తు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.






