RK Beach: మరోసారి ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్..తలెత్తుతున్న అనుమానాలు!

by Disha Web Desk 3 |
RK Beach: మరోసారి ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్..తలెత్తుతున్న అనుమానాలు!
X

దిశ డైనమిక్ బ్యూరో: సందర్శకుల్ని ఆకర్షించి టూరిజం పెంచడానికి విశాఖ లోని ఆర్‌కే బీచ్‌లో వీఎంఆర్‌డీఏ ఫ్లోటింగ్ వంతెనను ఏర్పాటు చేసింది. ఇక ఈ వంతెనను ఫిబ్రవరి 25 వ తేదీన రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. కాగా ప్రారంభోత్సవం జరిగి 24 గంటలు గడవకముందే వంతెన టీ జాయింట్‌ విడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే అలల తాకిడి ఎక్కువ ఉండడం కారణంగా ఇలా జరిగిందని.. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. అయితే మరోసారి నిన్న (శనివారం) మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో ఫ్లోటింగ్ వంతెన మళ్లీ ప్రధాన వంతెనతో విడిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంతో విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటక అకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వంతెన నిర్మాణానికి సుమారు కొటిన్నరకు పైగా వెచ్చించారు. అయితే వంతెన ప్రారంభించిన ఒక్క రోజులోనే సముద్రంలో కొట్టుకుపోవడంతో కోట్ల రూపాలు బూడిదలో పోసిన పన్నీరైందని విశాఖ వాసులు నిప్పులు చెరుగుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వంతెన పరిశీలన దశలోనే ఉండడంతో సందర్శకులను ఈ వంతెనపైకి అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయినంత పరిస్థితి నెలకొనడం.. అలానే తీరం వైపు తీసుకొచ్చిన బ్రిడ్జి ఒరిగిపోయి కనిపించడం, వంతెనకు అనుసంధానంగా ఉన్న కొన్ని డబ్బాలు సైతం దెబ్బతిని ఉండడం.. మధ్యాహం మూడు గంటల సమయంలో వంతెన మీద నుంచి మూడు, నాలుగు అడుగుల ఎత్తున అలలు ఎగసిపడడం.. ఇవన్నీ చూసిన సందర్శకుల్లో అసలు ఇక్కడ వంతెన ఏర్పాటు చేయడం అనుకూలమేనా అనే సందేహం తలెత్తుతోంది.

Next Story

Most Viewed