ఏసీపీ ఇంటిలో అగ్నిప్రమాదం.. కూలిన బాల్కనీ గోడ, ఒకరు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-12 11:11:42  IST  )

ఏసీపీ సత్యానందం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఏసీపీ ఇంటిలో అగ్నిప్రమాదం.. కూలిన బాల్కనీ గోడ, ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నగరంలోని పటమటలంకలో ప్రత్యూష అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఏసీపీ సత్యానందం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏపీ కంప్రెషర్లో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ కు అంటుకున్నాయి. దీంతో సిలిండర్ పేలిపోయింది. పక్కన ఇంటి వాళ్లు గమనించి అపార్ట్మెంట్ వాసుల్ని అప్రమత్తం చేయగా.. అందరూ తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే సిలిండర్, ఏపీ కంప్రెషర్ పేలిపోయాయి. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ బాల్కనీ గోడ, గ్రిల్స్ ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా.. ప్రమాద సమయంలో ఏసీపీ సత్యానందం కుటుంబం ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మే 7వ తేదీనే సత్యానందం కుటుంబ సభ్యులంతా విదేశాలకు వెళ్లగా.. రెండ్రోజుల క్రితమే ఆయన కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేకపోయినా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

జీజీహెచ్ లో మరో అగ్నిప్రమాదం

మరోవైపు గుంటూరు జీజీహెచ్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో 24వ వార్డులో వస్తువులు, సీలింగ్ మొత్తం కాలిపోయాయి. ఇటీవల అధికారులు వార్డు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ఆ వార్డులో రోగులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది.

Next Story