రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-11-25 08:00:36  IST  )

తుఫాను ముప్పు (Storm) నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinajarapu Atchhanaidu) కోరారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తుఫాను ముప్పు (Storm) నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinajarapu Atchhanaidu) కోరారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందన్నారు. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. తాను ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. పంటను కాపాడుకునే విషయంలో రైతులు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని కోరారు. వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

ధాన్యం కాపాడుకునేందుకు వీలుగా రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. అందులో భాగంగా ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని పొందవచ్చన్నారు. కాబట్టి వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విన్నవించారు. వ్యవసాయ అధికారులు కూడా రైతుల వద్దకు వెళ్లి వారికి తగిన సూచనలను చేయాలని ఆదేశించారు. సముద్రంలో అలజడి నెలకొన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదన్నారు. వేటకు వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

Next Story