Breaking: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-24 09:05:07  IST  )

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షులను బెదిరించిన కేసులో ఆయన కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో కోర్టు వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ..

Breaking: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(YCP MLC Anantha Babu)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షులను బెదిరించిన కేసు(Witnesses Intimidating Case)లో ఆయన కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో రాజమండ్రి కోర్టు వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతబాబు అరెస్ట్ సమయంలో కొందరు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ చెదరగొట్టిన పోలీసులు.. చివరకు అనంతబాబును అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

డ్రైవర్ హత్య కేసులో...

కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subrahmanyam Murder Case)లో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య సైతం నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షులు అరవ దుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్‌ను అనంతబాబు అనుచరులు ఇటీవల బలవంతంగా తీసుకెళ్లి కాకినాడలోని ఓ అపార్ట్ మెంట్‌లో బంధించారు. అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేనిపక్షంలో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలకు లభించాయి. దీంతో కేసు నమోదు చేసి అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. అనంతరం బయటకు వచ్చిన అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అనంతబాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Next Story