ఈఏపీసెట్ విద్యార్థులకు ధృవీకరణ పత్రాల కష్టాలు

by Naga Rani Yarlagadda |

ఏపీ ఈఏపీసెట్ విద్యార్థులకు ఆదాయ ధృవీకరణ పత్రం నిబంధన పెద్ద తలనొప్పిగా మారింది.

ఈఏపీసెట్ విద్యార్థులకు ధృవీకరణ పత్రాల కష్టాలు
X
  • దరఖాస్తుదారు పేరుతో ‘ఆదాయం’ ఇవ్వాలని నిబంధన
  • చుక్కలు చూపుతున్న రెవెన్యూ యంత్రాగం

దిశ, చిత్తూరు ప్రతినిధి: ఏపీ ఈఏపీ సెట్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థులకు ధృవీకరణ పత్రాల కష్టాలు వచ్చాయి. ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన తలనొప్పిగా మారింది. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఎక్కడ నుంచి ఆదాయం వస్తుందో..? నిబంధన పెట్టిన అధికారులకే ఎరుక. ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు ఆ శాఖ అధికారులు చుక్కలు చూపుతున్నారు. పరీక్షల వేళ విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ధృవీకరణ పత్రాలు తప్పనిసరి

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వారు ఏపీ ఈఏపీసెట్ కు ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 4 నుంచి వచ్చే నెల 7 వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఆ తరువాత దరఖాస్తు చేసే వారు అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఏపీఈఏపీ సెట్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ విద్యార్థులు రూ.800, బీసీ వారు రూ.750, ఎస్సీ, ఎస్టీ వారు రూ.700 వంతున చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉన్న వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పిస్తే, కళాశాలలో చేరిన తరువాత ఫీజు మినహాయింపు ఇస్తారు. ఈ నియమం అన్ని కులాల వారికీ వర్తిసుంది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు తప్పనిసరిగా కుల, నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీసెట్ కోసం 2.50లక్షల మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. వీరంతా తమకు అవసమైన ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నప్పటికీ, ఏపీ ఈఏఏపీసెట్ నోటీఫికేషన్ విడుదల కావడం, దరఖాస్తు చేసుకోవడం కీలకం కావడంతో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు.

చుక్కలు చూపుతున్న రెవెన్యూశాఖ

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం సచివాలయం లేదా మీసేవలో దరఖాస్తు చేయాలి. కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు సమయంలో సంబంధీకులకు చెందిన లేదా అభ్యర్థి పాత ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇవి రెండూ లేకపోతే, తప్పనిసరిగా అఫడివిట్ ఇవ్వాలి. ఇందుకోసం విద్యార్థులకు రూ.500వరకు ఖర్చు అవుతోంది. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్నాక, ఈ సమాచారం సంబంధిత వీఆర్వో లాగిన్ కు వెళుతుంది. వీఆర్వో ఎపుడు అందుబాటులోకి వస్తారో తెలియదు. ఆయన కోసం కనీసం రెండు లేదా మూడు రోజులు తిరగాలి. వీఆర్వో పరిశీలించి సంతకాలు చేసి తన లాగిన్ నుంచి రెవెన్యూ ఇన్ స్పెక్టరుకు ఫార్వర్డ్ చేస్తారు. ఆర్ఐ తీరిక చూసుకుని ఈ ధృవీకరణ పత్రాలు పరిశీలించి సంతకాలు చేసి తహసీల్దారు లాగిన్‌కు పంపుతారు. కొన్ని రోజుల తరువాత తహసీల్దారు వీటిని పరిశీలించి సంతకాలు చేస్తారు. ఆ తరువాత ఇవి కంప్యూటరు ఆపరేటరుకు పంపుతారు. ఈ తతంగంఅ అంతా పూర్తి కావడానికి పది రోజులకు పైగానే పడుతోంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పరీక్షల వేళ ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఆదాయం’ కోసం వింత నిబంధన

ఈఏపీ సెట్ వారు విద్యార్థుల పేరుతో ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలని వింత నిబంధన విధించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా ఆదాయ ధృవీకరణ పత్రం విద్యార్ధుల తల్లిదండ్రుల పేరున తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థి దశలో ఎలాంటి ఆదాయం ఉండదు. వారి తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి వారు ఉంటారు. ఈ నిబంధనతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వడానిని చాలా మంది రెవెన్యూ అధికారులు అంగీకరించడం లేదు. కొంతమంది మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంజూరు చేస్తున్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం విషయంలో సాంకేతిక విద్యాశాఖ పరిశీలించి సవరణ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

Next Story