- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలోని కూటమి నేతల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన (TDP vs Janasena) కార్పొరేటర్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తి పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డు వెడల్పులో భాగంగా కేటాయించిన టీడీఆర్ (Transferable Development Rights) బాండ్ల విషయంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గతంలోనే కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి కూడా లబ్ధి చేకూర్చారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కమిషనర్ గది బయట టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఈ ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది.
ఒకరిపై ఒకరు వేళ్లు చూపిస్తూ.. బిగ్గరగా అరుస్తూ వాదించుకోవడంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీఆర్ స్కామ్‌పై విచారణ జరిపించాలని జనసేన పట్టుబడుతుండగా, కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో కమిషనర్ గది ముందే ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం విశాఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల సమక్షంలోనే ప్రజాప్రతినిధులు ఇలా గొడవకు దిగడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఈ ఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






