TTD:తిరుమలలో ఆ రెండు రోజులు తుంబురుతీర్థ ముక్కోటి.. ఆ సమయంలోనే భక్తులకు అనుమతి

by Jakkula.Mamatha |

తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తారు.

TTD:తిరుమలలో ఆ రెండు రోజులు తుంబురుతీర్థ ముక్కోటి.. ఆ సమయంలోనే భక్తులకు అనుమతి
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తారు. రేపు, ఎల్లుండి తిరుమల(Tirumala)లో తుంబురు తీర్థం ముక్కోటి ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఈ నెల 11, 12వ తేదీల్లో ఉదయం 05 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందిస్తారు.

ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని టీటీడీ తెలిపింది. భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు TTD విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

Next Story