గత ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయింది : సీఎం చంద్రబాబు నాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-08 11:32:45  IST  )

రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

గత ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయింది : సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా ఆదాయం కూడా తగ్గిపోయిందని పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మళ్లీ అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని సీఎం వివరించారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అవకతవకలకు పాల్పడిందని తెలిపారు. దాని వల్ల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులను ఇతర పథకాలుక మళ్లించిందన్నారు.

విద్యుత్ చార్జీలను పెంచకుండానే

పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అయినప్పటికీ ఆ భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల యత్నిస్తోందన్నారు. విద్యుత్ చార్జీల భారం పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిలబెడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సామర్థ్యం పెంచుకుంటామని తెలియజేశారు. గతంలో పీపీఏల రద్దు వల్ల విద్యుత్ వాడకుండానే రూ.9వేల కోట్ల వ్యయం జరిగిందన్నారు.

బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది

వైసీపీ పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసీపీ పాలకుల దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి పంట గుంటలు తవ్వామన్నారు. అంతేకాకుండా చెక్ డ్యాంలు కట్టామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. మూలధన వ్యయం చేయకపోవడంతో గతంలో ప్రాజెక్టులు ముందుకెళ్లలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగామని సీఎం వివరించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రిజర్వాయర్లలో నేటికి 950 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఎస్ఐపీబీల ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా ఆమోదం తెలిపామన్నారు.

విద్యా వ్యవస్థలోనూ పెండింగ్

ఇంగ్లీష్ మీడియం పేరిట విద్యా వ్యవస్థలో కూడా వైసీపీ పాలకులు డ్రామాలాడారన్నారు. విద్యా రంగ అనుబంధ అన్ని బిల్లులు కూడా పెండింగ్ పెట్టారని విమర్శించారు.

చెత్తను వారసత్వంగా ఇచ్చారు

అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందన్నారు. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలనేది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేశామని తెలియజేశారు.

పల్లె పండుగతో

పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనను మెరుగుపరుస్తున్నాం అన్నారు.

ప్రతి త్రైమాసికం పర్యవేక్షణ

సాధారణంగా జీఎస్డీపీ దేశ స్థాయిలో గణిస్తారన్నారు. 2015 నుంచి ఏపీలో ఈ ప్రక్రియ ప్రారంభించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారన్నారు. 2014-19 మధ్య 13.5 శాతంగా డెవలప్మెంట్ రేట్ ఉండేదన్నారు. 2019-24 మధ్య 10.32 శాతానికి పడిపోయిందన్నారు. ప్రతి త్రైమాసికం, ఆర్థిక ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పర్యవేక్షిస్తున్నాం అన్నారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆస్తులతో పాటు భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశారని గుర్తు చేశారు.

ప్రజల చేతుల్లోకి పాలన

18 నెలల నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి క్షణం కష్టపడ్డామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి వ్యవయాన్ని భారీగా పెంచగలిగామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లక్షల కోట్ల పెట్టబడులు తీసుకొచ్చామన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలన తీసుకెళ్లామని తెలియజేశారు.

Next Story