పెడనలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-21 02:46:32  IST  )

కార్యకర్త కుటుంబానికి భరోసానివ్వనున్న జనసేనాని.

పెడనలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు కృష్ణా జిల్లా పెడన (Pedana) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త వీర వెంకట వసంత రాయలు (Veera Venkata Vasanta Rayalu) కుటుంబాన్ని ఆయన ఈ సందర్భంగా పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సమయంలోనే వసంత రాయలు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, నేడు స్వయంగా వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తను కోల్పోవడం తీరని లోటని.. ముఖ్యంగా మరణానంతరం తన అవయవాలను దానం చేయడం ద్వారా ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించిన వసంత రాయలు త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కొనియాడారు.

ఈ పర్యటనలో భాగంగా వసంత రాయలు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్న డిప్యూటీ సీఎం, ఆ కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. కార్యకర్తల సంక్షేమమే జనసేన (Janasena) ప్రథమ ప్రాధాన్యమని, ఆపదలో ఉన్న ప్రతి జనసైనికుడికి బాసటగా నిలవడమే తమ లక్ష్యమని ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో పెడనలో జనసేన శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. తమ నాయకుడు స్వయంగా వచ్చి పరామర్శించనుండటంతో అటు వసంత రాయలు కుటుంబం, ఇటు స్థానిక కార్యకర్తలు కొంత ఊరట చెందుతున్నారు. పర్యటన అనంతరం ఆయన స్థానిక నేతలతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది.

Next Story