అటవీ అభివృద్ధిలో భారీ కార్యాచరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా రాష్ట్ర అటవీశాఖ భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ..

అటవీ అభివృద్ధిలో భారీ కార్యాచరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా రాష్ట్ర అటవీశాఖ(Forest Department) భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతులను (సీడ్ బాల్స్) పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) వెల్లడించారు. ఈ విత్తన బంతుల తయారీ, పంపిణీ ప్రక్రియను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మహాయజ్ఞంలా చేపట్టబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జీవవైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే పరమావధిగా ఈ హరిత సమరాన్ని ముందుకు తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

జూన్‌లో 'సీడ్ బాల్స్' మహోత్సవం

వచ్చే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతుల తయారీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలలో పచ్చదనాన్ని త్వరితగతిన పెంచేందుకు ఈసారి సరికొత్త సాంకేతికతను జోడించనున్నట్లు చెప్పారు. సాధారణ పద్ధతులతో పాటు మనుషులు చేరుకోలేని దట్టమైన అటవీప్రాంతాలు, కొండ కోనల్లో విత్తన బంతులను చల్లడానికి అత్యాధునిక డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని (Drone Technology) పెద్ద ఎత్తున వినియోగించబోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ప్రజలంతా భాగస్వాములు కావాలి: పవన్

ఈ బృహత్తర పర్యావరణ ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరి ఉమ్మడి భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచి, రాబోయే తరాలకు మెరుగైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story