ఏప్రిల్ 6వ తేదీ.. చరిత్రలో నిలిచిపోతుంది : పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ.. గెజిట్ విడుదల చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 6వ తేదీ.. చరిత్రలో నిలిచిపోతుంది : పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదని, అనిశ్చితిలో ఉన్న భవిష్యత్ కానే కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని ఎక్స్ లో రాసుకొచ్చారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొంది, భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసిన తర్వాత.. భారత రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ ప్రజల సుదీర్ఘకాల కల ఎట్టకేలకు నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని సాకారం చేసినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణం త్యాగాలు చేసిన రైతులకు, అచంచలమైన సంకల్పంతో నిలబడిన ప్రజలకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన 12 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత.. ఆంధ్రప్రదేశ్ చివరకు భారత ప్రభుత్వంచే అధికారికంగా గుర్తించబడిన రాజధానిని పొందిందని పేర్కొన్నారు. రాజధాని విషయంలో గతంలోని అనిశ్చితి, ఆటంకాలను వీడి, మనమందరం కలిసి ప్రజా రాజధాని అమరావతిని నిర్మిద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భావి తరాలకు బలమైన పునాది వేస్తూ, మన రాష్ట్రాన్ని 'స్వర్ణ ఆంధ్ర 2047' విజన్ దిశగా నడిపిద్దామన్నారు.

Next Story