మా తెలుగు తల్లి గేయం లిరిక్స్ మార్చాలి: డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా తెలుగు తల్లి గేయం లిరిక్స్ మార్చాలి: డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం సమీపంలో ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులను ప్రశ్నించారు.

పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే కలుషిత నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. నివేదికలు వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నదులను కలుషితం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణ, వ్యర్థాల విడుదలపై నిరంతర పర్యవేక్షణతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

లిరిక్స్ మార్చాలి..

గోదావరి, కృష్ణా నదుల ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘‘మా తెలుగు తల్లి గేయంలో గోదావరి, కృష్ణమ్మల గలగలలు అని పాడుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పవన్ తెలిపారు. పవిత్ర గోదావరి నదిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Next Story