రాజమండ్రి మృతుల పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాకే చర్యలు : జిల్లా కలెక్టర్, ఎస్పీ

by Naga Rani Yarlagadda |

రాజమండ్రిలో వరుస మరణాలు చోటుచేసుకోవడంపై జిల్లా కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ స్పందించారు. కల్తీపాలే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజమండ్రి మృతుల పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాకే చర్యలు : జిల్లా కలెక్టర్, ఎస్పీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో నిన్నటి నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో నలుగురు మరణించడం రాష్ట్రంలో తీవ్రకలకలం రేపింది. వారి మరణాలకు కల్తీపాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి, ఎస్పీ నారాయణ మీడియా సమావేశం నిర్వహించి కీలక వివరాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినవారి పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రజలు కూడా రెగ్యులర్ గా తీసుకునే పాలను బాగా మరిగించి తాగాలని సూచించారు. ప్యాక్డ్ పాశ్చరైజ్డ్ మిల్క్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న పాలవ్యాపారిని విచారణ చేస్తున్నామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాకే ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. మృతులు అంతా కిడ్నీ సమస్యలతో చనిపోయినట్లు వైద్యులు చెప్తున్నారన్నారు.

మృతులను చౌడేశ్వరి నగర్ కు చెందిన బి.కనకరత్నం, ఎన్. శేషగిరిరావు, నారాయణపురానికి చెందిన తాడి కృష్ణవేణి, గాంధీపురానికి చెందిన తాడి రమణి దివాన్ చెరువుకు చెందిన రాధాకృష్ణమూర్తిగా గుర్తించామన్నారు. వీరిలో కనకరత్నం అనే 74 ఏళ్ల మహిళ సాధారణంగా ఉన్న అనారోగ్య సమస్యలతోనే మరణించిందన్నారు. నిన్న చనిపోయిన వ్యక్తి పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి వెల్లడించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారని చెప్పారు. ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ కాదని, ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. ఇంకా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే 9494060060 కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయవచ్చన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రి పాలవ్వడానికి గల కారణాలపై వైద్యులు కూడా సమీక్షిస్తున్నారని చెప్పారు.

Next Story