ఒంటిమిట్టకు వెళ్లలేని జగన్ చిలకలూరిపేటకు ఎలా వెళ్లారు..?

by Disha Web Desk 16 |
ఒంటిమిట్టకు వెళ్లలేని జగన్ చిలకలూరిపేటకు ఎలా వెళ్లారు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అందులో ఎలాంటి సందేహం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంలో తానేం అబద్దాలు చెప్పడం లేదని వివరణ ఇచ్చారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉండడమే కాకుండా ఎదురు తమకే ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరికి సీటిస్తామనే హామీ ఇస్తే నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందని, అందుకే తమతో టచ్‌లోకి వస్తున్నారని అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. తామే టీడీపీలోకి వెళ్లమని.. వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే టీడీపీలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.


సతీసమేతంగా వెళ్లడం ఇష్టంలేకనే

కాలు బెణికిందన్న సాకుతో ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టిన సీఎం జగన్ చిలకలూరిపేట పర్యటనకు ఎలా వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణానికి సీఎం దంపతుల వెళ్లడం ఆనవాయితీ. కానీ కాలు బెణికిందనే సాకుతో జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. సతీ సమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు. కానీ సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లాలి కదా..?. కాలు నొప్పి సాకుతో ఒంటిమిట్ట వెళ్లని జగన్ నిన్న జగ్జీనన్ రాం జయంతి, నేడు చిలకలూరి పేట కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు?. ఒక్క రోజులోనే కాలు నొప్ప్పి తగ్గిందా?. సీతారాముల వారి కళ్యాణానికి సతీసమేతంగా వెళ్లే ఇష్టం లేకనే జగన్ రెడ్డి కాలు బెణికిందంటూ కుంటి సాకు చెప్పారు.’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి తన వ్యవహారశైలితో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

మంత్రి ధర్మాన మైండ్ పని చేయడం లేదు

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ధర్మానకు మైండ్ పని చేయడం లేదని విమర్శించారు. ధర్మాన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదని కానీ పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రజా వ్యతిరేకతతో ధర్మాన బ్యాలెన్స్ తప్పుతున్నారని విమర్శించారు. ‘ధర్మాన మహిళల ముందు మీసాలు మేలేస్తున్నారు.. తొడ కొడుతున్నారు. మగాళ్లను పొరంబోకులు అంటూ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. సీఎం జగన్, ధర్మాన కూడా మగాళ్లే కదా..?, వాళ్లూ పొరంబోకులేనా..?.అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Next Story