విద్యావ్యవస్థలో విప్లవం: విద్యార్థులకు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు.

విద్యావ్యవస్థలో విప్లవం: విద్యార్థులకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. గురువారం సచివాలయంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా విభాగాలపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో ఉంటాయో ముందే ఊహించి, దానికి తగ్గట్టుగా 'కోర్సుల ఫోర్ క్యాస్టింగ్' (Course Forecasting) జరగాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు కేవలం డిగ్రీలు పొందడమే కాకుండా.. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌ల వైపు అడుగులు వేసేలా పాఠ్యప్రణాళికలు ఉండాలని కోరారు.

ప్రపంచంతో పోటీ పడేలా ఏపీ వర్సిటీలు..

ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలతో ఏపీ వర్సిటీలు పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతులను మెరుగుపరచాలని ఆదేశించారు. ఇదే సమయంలో, సరికొత్త సాంకేతికత అయిన 'క్వాంటం టెక్నాలజీ'పై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని (AU) ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని మంత్రి లోకేష్, అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యా కేంద్రంగా (Knowledge Hub) మార్చేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Next Story